600వికెట్లు.. అతనికే సాధ్యం

లండన్: భారత్‌తో టెస్టు సిరీస్‌లో అసాధారణ స్థాయిలో రాణించిన ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌పై ఆస్ట్రేలియా పేస్ లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచిన నేపథ్యంలో మెక్‌గ్రాత్ స్పందించాడు. ఫాస్ట్‌బౌలర్ల విభాగంలో కొన్నేళ్లుగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగిన మెక్‌గ్రాత్‌ను ఆండర్సన్ అధిగమించాడు. ఆఖరిదైన ఐదో టెస్టు చివరి రోజు మ్యాచ్‌లో భారత ఆటగాడు మహ్మద్ షమీని ఔట్ చేయడంతో జిమ్మీ ఈ ఘనత అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో 143 మ్యాచ్‌ల్లో ఆండర్సన్ ఇప్పటి వరకు 564 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తరువాత మెక్‌గ్రాత్ 124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వాల్ష్(132స్థానాల్లో) 519 వికెట్లు, కపిల్ దేవ్(131మ్యాచ్‌లు) 434 వికెట్లు, స్టువర్ట్ బ్రాడ్(123మ్యాచ్‌లు) 433 వికెట్లు తీసి తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓవరాల్‌గా టెస్టు బౌలర్లలో స్పిన్ త్రయం ముత్తయ్య మురళీధరన్(800), షేన్ వార్న్(708), అనిల్ కుంబ్లే(619, భారత్) అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్-3లో ఉన్నారు. 600 వికెట్లు.. అతనికే సాధ్యం ప్రస్తుతం జిమ్మీ అద్భుత ఫిట్‌నెస్‌తో గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. అతడు నా రికార్డును అధిగమించాడు. అతడి తదుపరి టార్గెట్ టెస్టుల్లో 600 వికెట్లు తీయడమే. ప్రస్తుత తరంలో అది అతనికే సాధ్యం. ఒకవేళ అతడు 600 మైలురాయిని దాటితే అది గొప్ప ఘనతే. ఇదే ఫామ్‌ను కొనసాగించి మరిన్ని వికెట్లు తీయాలని నేను కోరుకుంటున్నా. అతడు గట్టిగా ప్రయత్నిస్తే టాప్-3లో ఉన్న ఒక స్పిన్నర్ రికార్డును అతడు అందుకోగలడు. అది కుంబ్లే(619)ను చేరుకోవడమే. అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.

Related Stories: