ఎప్పుడూ వాట్సాపేనా.. ఈ పెళ్లి మాకొద్దు!

లక్నో: సోషల్ మీడియాకు యువత ఇప్పుడు బానిసలుగా మారిపోయారు. అందులోనూ వాట్సాప్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజూ గంటల తరబడి అందులోనే గడుపుతున్నారు. ఈ వ్యసనం ఎంత కీడు చేస్తుందో యూపీలోని ఓ పెళ్లి కూతురుకు తెలిసొచ్చింది. యూపీలోని నౌగావ్ సాదత్ అనే గ్రామంలో వాట్సాప్ కారణంగా ఓ పెళ్లే ఆగిపోయింది. పెళ్లి రోజు అన్ని ఏర్పాట్లు చేసుకొని పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి తరఫు వాళ్లకు పెద్ద షాక్ తగిలింది. పెళ్లి కొడుకు, అతని తరుఫు వాళ్లు ఎంతకీ రాకపోవడంతో ఫోన్ చేసి ఆరా తీశారు. వాళ్లు చెప్పిన కారణం విని పెళ్లి కూతురు, ఆమె బంధువులకు దిమ్మదిరిగిపోయింది. అమ్మాయి ఎప్పుడు చూసినా వాట్సాప్‌తోనే కాలక్షేపం చేస్తున్నది.. ఈ పెళ్లి మాకొద్దు అని వాళ్లు తేల్చి చెప్పారు. అయితే అసలు కారణం కాదని, వాళ్లు అడిగినంత కట్నం ఇవ్వకపోవడం వల్లే చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్నారని అమ్మాయి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పెళ్లి కూతురు తండ్రి ఉరోజ్ మెహంది ఫిర్యాదు మేరకు పెళ్లికొడుకు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వాళ్లు రూ.65 లక్షల కట్నం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫకీర్‌పురకు చెందిన ఖమర్ హైదర్ తనయుడితో తన కూతురికి పెళ్లి నిశ్చయం చేసినట్లు మెహంది చెప్పాడు. పెళ్లి రోజు వాళ్లు ఎంతకీ రాకపోవడంతో ఫోన్ చేశానని, పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు వాళ్లు చెప్పారని అతను తెలిపాడు. అయితే పెళ్లి కొడుకు తరఫు వాళ్లు మాత్రం అమ్మాయికి వాట్సాప్ వాడకం ఎక్కువగా ఉన్నందుకే రద్దు చేసుకున్నామని, పెళ్లికి ముందే అత్తారింటి వారికి వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తున్నదని ఆరోపించారు.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య