దళ కమాండర్ పుల్లన్న అరెస్టు

మహబూబాబాద్ : గూడూరు డివిజన్ కార్యదర్శి సంగపొంగు ముత్తయ్య అలియాస్ పుల్లన్న అలియాస్ మనోజ్‌ను, అతని గన్‌మెన్ ఇర్సులాపురం (మిర్యాలపెంట)కు చెందిన నల్లమారి అశోక్‌లను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. గంగారం మండలంలోని పెద్దాపూర్‌కు వెళ్తున్నట్లు ముందుగా అందిన సమాచారంతో రూరల్ సీఐ రమేశ్, గంగారం ఎస్సై భద్రునాయక్ సిబ్బందితో కలిసి పెద్ద ఎల్లాపూర్‌గ్రామం వద్ద మాటువేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు.

పుల్లన్న వద్ద నుంచి 9 ఎంఎం కార్బైన్ తుపాకీ, 25 తుటాలు, 100 8ఎంఎం రౌండ్లు, రూ.23వేల నగదు, యూనిఫాం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పుల్లన్న 1990 నుంచి ఉద్యమంలో పనిచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అతనిపై 10 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఇంకా కొన్ని విచారించేవి ఉన్నాయని తెలిపారు. పుల్లన్న పలు చోట్ల వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులు నమోదయ్యాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ నరేశ్‌కుమార్, గూడూరు సీఐ రమేశ్ పాల్గొన్నారు.

× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?