కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రెబల్ బరిలో మానుకొండ..?

2 వేల మంది కార్యకర్తలతో నగరంలో సమావేశం సిట్టింగ్ సీటును టీడీపీకి అమ్ముకున్నదని కాంగ్రెస్‌పై ఆగ్రహం 19న నామినేషన్ వేస్తానని ప్రకటించిన ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్‌ రాధాకిషోర్ ఖమ్మం: జిల్లాలో కూటమి పార్టీకి మరో ఎదురుదెబ్బ ఎదురైంది. సీటు దక్కని అసంతృప్తులు తిరుగుబాటుకు సిద్ధమవుతూనే ఉన్నారు. కార్యకర్తల అభీష్టమే తమ నిర్ణయంగా రెబల్‌గా బరిలోకి దిగి సత్తాచూపేందుకు రెడీ అవుతున్నారు. అభ్యర్థుల ప్రకటన జరిగిన రోజు నుంచే కూటమి పార్టీల్లో మొదలైన ముసలం ముదిరిపాకాన పడుతోంది. ఖమ్మం నియోజకవర్గం సీటు సిట్టింగ్‌కి కాకుండా టీడీపీకి కేటాయించడం పట్ల ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న ఖమ్మం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మానుకొండ రాధాకిషోర్ అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరం బాలప్పేటలో 2వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమై తన మనోవేదనను, భవిష్యత్ కార్యచరణను కార్యకర్తలతో పంచుకున్నారు. అధిష్టానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని మరో పార్టీకి అమ్ముకొని తీవ్ర అన్యాయాన్ని చేసేందుకు పూనుకుందన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం ఖమ్మంలో పార్టీని భుజస్కందాలపై వేసుకొని మోస్తుంటే వెన్నుపోటు పొడవడం ఎంతవరకు సమంజసమన్నారు. సిట్టింగ్ స్థానాన్ని టీడీపీకి కేటాయించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో పార్టీ అధిష్టానం సమాదానం చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనుచరుడిననే కారణంతో సీటు కేటాయిస్తే రేణుకా చౌదరి ప్రాతినిధ్యం జిల్లాలో బలంగా ఉంటుందని, దానిని ఓర్వలేకనే తనకు సీటు ఇవ్వలేదని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తల కోరిక మేరకు ఈ నెల 19లోగా కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకొని వెల్లడించకపోతే 19న 10వేల మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులతో ఖమ్మం తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల్లో తన బలమేంటో నిరూపించుకుంటానన్నారు.

Related Stories: