పైసా తీసుకోకుండా..

సినిమా మీద ఉన్న ప్రేమతో పైసా తీసుకోకుండా ప్రతి ఒక్కరం పనిచేసిన సినిమా ఇది అని చెప్పింది చాందినిచౌదరి. ఆమె కథానాయికగా నటించిన చిత్రం మను. క్రౌడ్ ఫండింగ్ పద్దతిలో నిర్మించిన ఈ చిత్రానికి ఫణింద్ర నర్సెట్టి దర్శకుడు. ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చాందినిచౌదరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఇందులో నీల అనే అమ్మాయిగా కనిపిస్తాను. మను అనే కళాకారుడితో ఆమెకున్న సంబంధం ఏమిటనేది ఆకట్టుకుంటుంది. మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో ముడిపడిన సినిమా ఇది. ఇందులో నా నటన, పాత్రచిత్రణ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. గ్లిజరిన్ వాడకుండా నటించాను. పాత్రలో పరిపూర్ణత కోసం నలభైఐదు రోజులు వర్క్‌షాప్ చేశాను. ఇప్పటివరకు నేను చూడని, చేయని పాత్ర ఇది. నటిగా నాకు సంతృప్తిని మిగిల్చింది. మంచి సినిమా చేశానని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. గతంలో దర్శకుడు ఫణీంద్రతో మధురం అనే లఘు చిత్రం చేశాను. ఆయన చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాను అంగీకరించాను. హద్దులకు లోబడి గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమే అని తెలిపింది.