మూకుమ్మడిదాడి నిరోధక బిల్లుకు మణిపూర్ క్యాబినెట్ ఆమోదం

దేశంలో మూకుమ్మడి దాడులు అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతున్న నేపథ్యంలో మణిపూర్ ఈ అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించింది. మూకుమ్మడి హింస నియంత్రణ, నిరోధక బిల్లుకు మణిపూర్ క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. చట్టపరమైన విచారణకు అవకాశం లేకుండా మనుషుల్ని ఏవో కారణాలతో కొట్టిచంపే ఘటనలు దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే మణిపూర్‌లోనూ పెచ్చరిల్లుతున్నాయి. వారంరోజుల క్రితం పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని తరోయ్‌జామ్‌లో ఫరూక్‌ఖాన్ అనే మేనజ్‌మెంట్ స్టూడెంట్‌ను స్కూటర్ దొంగిలిస్తున్నాడనే అనుమానంతో జనం కొట్టిచంపిన ఘటన సంచలనం కలిగించింది. మానవహక్కుల సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ క్యాబినెట్ బిల్లును ఆమోదించడం గమనార్హం. వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.

Related Stories: