ఆ మూవీ రీషూట్‌కు 20 కోట్ల ఖర్చు!

కంగనా రనౌత్, సోనూ సూద్ మధ్య విభేదాలు మణికర్ణిక నిర్మాతలకు బాగానే నష్టం చేకూర్చినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. సోనూ సూద్ ఈ మూవీ నుంచి తప్పుకున్న తర్వాత కొంత ప్యాచ్‌వర్క్ మాత్రం చేయాల్సి ఉందని చెప్పారు. కేవలం పది రోజుల్లో అది పూర్తవుతుందని, దీనికి లీడ్ రోల్ ప్లే చేస్తున్న కంగనా రనౌతే దర్శకత్వం వహిస్తున్నారనీ చెప్పారు. కానీ ఇప్పుడీ రీషూట్ 45 రోజుల షెడ్యూల్‌గా మారింది. నిర్మాతలు అదనంగా మరో రూ.20 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోనూ సూద్ స్థానంలో వచ్చిన మొహమ్మద్ జీషాన్ ఆయూబ్‌తో రీషూట్ చేయాల్సి ఉంది. అయితే అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించడానికి డీల్ కుదరడంతో మణికర్ణిక డైరెక్టర్ క్రిష్.. ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు.

దీంతో కంగనా రనౌత్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. మొదట ప్యాచ్‌వర్క్ షూట్‌గా భావించినా.. క్రిష్ దర్శకత్వం వహించిన కొన్ని సీన్లను కూడా రీషూట్ చేయాలని నిర్ణయించారు. ఈ మూవీ తొలి స్క్రీనింగ్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన స్క్రిప్ట్‌కు సరిగ్గా సరిపోలేదని నిర్మాతలు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. దీంతో కొన్ని సీన్లను స్క్రిప్ట్‌కు సరిపడినట్లు రీషూట్ చేయాలని నిర్ణయించారు. కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కించడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్‌ను కూడా తీసుకొచ్చారు.

Related Stories: