చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజాసంక్షేమానికే అంకితం

-కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులే మంత్రి పదవి దాకా తీసుకెళ్లాయి -అభివృద్ధి పనుల రూపంలో రుణం తీర్చుకుంటా -ముఖ్యమంత్రి గొప్ప మానవతావాది, ఆయన ఒక డిక్షనరీ - కేసీఆర్‌ బొమ్మతోనే గత ఎన్నికల్లో 88 స్థానాలు సాధించాం - నేటి నుంచి నగరంలో స్మార్ట్‌సిటీ పనులను పరుగులు పెట్టిస్తాం -వచ్చే దసరా నుంచి ఐటీ టవర్‌ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం -ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నదే మా అధినేత సూచన.. ఆ బాటలోనే నడుస్తా -విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌ ‘19 ఏళ్లుగా అపజయం ఎరుగని నాయకుడిగా నన్ను నిలబెట్టిన కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులే నన్ను మంత్రి పదవి వరకు తీసుకెళ్లాయి.. నాపై చూపించిన అభిమానానికి శిరస్సు వంచి నమస్కరించడమే కాదు.. వారి రుణం తీర్చుకోవడానికి నా చివరి రక్తపు బొట్టువరకూ పనిచేస్తా’నని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహార మరియు పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా మంగళవారం కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టి చూపిస్తామన్న ఆయన, సీఎం గొప్ప మానవతా వాది అనీ.. ఒక డిక్షనరీ అంటూ కొనియాడారు. ప్రతి పనిలోనూ సీఎం కేసీఆర్‌ తనకు ఆదర్శమనీ, కేటీఆర్‌ స్ఫూర్తిదాయకమని చెబుతూనే అనేక అంశాలపై మాట్లాడారు. (కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) :ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపై అత్యంత ప్రేమ ఉందన్న విషయం రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణతో మరోసారి రుజువు అయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహార మరియు పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే మంత్రులుగా కొప్పుల ఈశ్వర్‌, ఈటల రాజేందర్‌ ఉండడంతో ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కేబినెట్‌ హోదాలో కొనసాగుతున్న విషయం తెలిసిందేనన్నారు. గులాబీ పార్టీకి ఆది నుంచీ అండగా నిలబడిన ఉమ్మడి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కరీంనగర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తనతోపాటు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌కు మంత్రి పదవులు ఇచ్చారనీ, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఐదుగురికి కేబినెట్‌లో అవకాశం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌కు జిల్లాపై ఉన్న మమకారానికి ఇదో నిదర్శమని పేర్కొన్నారు. కేబినేట్‌లో అధికంగా ఉన్న మంత్రులుగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు ఖ్యాతి దక్కిందన్నారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి శిరస్సు వంచి కరీంనగర్‌ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరం కలసికట్టుగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తెస్తామనీ, కేసీఆర్‌ సార్‌ నమ్మకాన్ని నిలబెడుతామని స్పష్టం చేశారు. ద్వంద్వ వైఖరిపై దండెత్తింది నేనే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించాననీ, ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన ద్వంద్వ వైఖరిపై తొలి గొంతుకై ఎదురించింది తానేనని మంత్రి చెప్పారు. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చి ఆ తర్వాత తన నిర్ణయాన్ని చంద్రబాబు మార్చుకోవడంతో ఆనాడు టీడీపీకి రాజీనామా చేసి, తెలంగాణ చౌక్‌లో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తదుపరి జరిగిన పరిణామాల మేరకు పూర్తిగా టీడీపీకి దూరమై టీఆర్‌ఎస్‌లో చేరి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విషయాన్ని వివరించారు. అసలుసిసలైన తెలంగాణవాదిగా ప్రత్యేక తెలంగాణ సాధనకు తన వంతు పోరాటం చేశానన్నారు. ఆ తదుపరి కేసీఆర్‌ అడుగు జాడల్లో నడువడమేకాకుండా.. ఎమ్మెల్యేగా ప్రజా సేవకు అంకితమయ్యానని చెప్పారు. రెండోసారి గెలిచినప్పుడు మంత్రి పదవిని ఆశించిన మాట వాస్తవమేననీ, పదవి వచ్చినా రాకపోయినా ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్లామే తప్ప ఏనాడూ అసంతృప్తికి లోనుకాలేదనీ, అప్పటికీ ఇప్పటికీ కేసీఆరే తమకు అధినేత అనీ, వారి అడుగుజాడల్లో నడువడమే తమ లక్ష్యంగా భావించిముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఒక డిక్షనరీ.. ముఖ్యమంత్రి అపార విజ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడే మాత్రం కాదనీ, అన్ని అంశాలను సమగ్రంగా నిక్షిప్తం చేసుకున్న ఒక డిక్షనరీ ఆయనలో కనిపిస్తుందన్నారు. పదాల అర్థాల కోసం డిక్షనరీలో వెతుక్కొని విషయం తెలుసుకుంటామనీ, అలాగే ముఖ్యమంత్రి మేథోశక్తిని చూస్తే సమస్త అంశాలను నింపుకున్న డిక్షనరీలా కనిపిస్తుందన్నారు. ఏ అంశం అయినా సరే సంపూర్ణ సమాచారం వారి వద్ద ఉంటుందనీ, సదరు అంశాలను అనర్గళంగా విప్పిచెప్పే గొప్ప మేథోశక్తి కూడా ఉందని ప్రశంసించారు. అనతి కాలంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌వన్‌ స్థానంలో ఉండచమే కాదు.. గొప్ప పరిపాలన దక్షుడిగా, విజ్ఞానవేత్తగా ప్రశంసలు అందుకుంటున్న కేసీఆర్‌ వద్ద మంత్రిగా పనిచేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామనీ, ప్రజా సంక్షేమం కోసం సీఎం ఏది చెపితే అదే బాటలో పయనిస్తామని స్పష్టం చేశారు. గొప్ప మానవత్వం ఉన్న మహానీయుడు మన సీఎం అని.. కరీంనగర్‌ అభివృద్ధితోపాటు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఏదీ అడిగినా ఇప్పటివరకు కాదు లేదు అని చెప్పకుండా అన్ని చేస్తుండడమే దీనికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌ బొమ్మను చూసే ఓట్లు.. తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటం, స్వరాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న ప్రణాళికలు, పడుతున్న కష్టాలను చూసిన ప్రజలు రెండో సారి అత్యధిక మెజార్టీ నిచ్చి పట్టం కట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను పూర్తిగా విశ్వసిస్తున్నాని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం గత అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గులాబీ అభ్యర్థులను గెలిపించడంతోపాటు తాజాగా జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో వెల్లడి అయిన ఫలితాలే అని పేర్కొన్నారు. తాము పనిచేస్తామన్న నమ్మకం విశ్వాసం ప్రజలకు ఉన్నప్పటికీ కేసీఆర్‌కు రెండోసారి అవకాశం ఇవ్వాలన్న తపన ప్రజల్లో అత్యధికంగా కనిపించిందనీ, ఈ పరిస్థితుల్లోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశామని చెప్పారు. ఇక ముందు ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగురడం ఖాయమని స్పష్టం చేశారు. నమ్మకాన్ని నిలబెడుతా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనపై నమ్మకం ఉంచి అతి పెద్ద పోర్టుపోలియో ఇచ్చారనీ, సీఎం ఏ ఆశయంతో తనకు పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని, ఆశయాన్ని నిలబెట్టి చూపిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆ వర్గాల బిడ్డలకు, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని సీఎం కల్పించారనీ, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు నిర్విరామంగా సేవలందిస్తామన్నారు. వెనుకబడిన వర్గాల్లో చిరునవ్వు చూడాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమనీ, అందుకోసం పనిచేస్తామన్నారు. అలాగే పౌరసరఫరాల శాఖలో అవినీతి లేకుండా చూస్తామన్నారు. రైస్‌మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను పాటించడమేకాదు.. ముఖ్యంగా కొనుగోళ్ల విషయంలో అన్నదాతలకు అండగా నిలవాలని సూచించారు. అదే విధంగా తప్పుడు పద్ధతుల్లో వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. మిల్లర్ల సమస్యలు ఎమైనా ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజా సంక్షేమానికి అంకితమవుతానని స్పష్టం చేశారు. కరీంనగర్‌ ప్రజల ఆశీర్వాదమే.. కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం బలం వల్లే ఈ రోజు తనకు మంత్రి పదవి దక్కినట్లుగా భావిస్తున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. తన 19ఏళ్ల రాజకీయ జీవితంలో వరుస విజయాలను ఇస్తూ నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా తాను ఎన్నో పనులు చేసినప్పటికీ, మంత్రిగా వారి ఆంకాక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులను మరింతగా వేగంగా చేసి వారి రుణం తీర్చుకుంటామన్నారు. ఇన్నేళ్లలో తనపై ఎటువంటి మచ్చ లేదనీ, ఇక ముందు కూడా అలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తన ద్వారా పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ ఎటువంటి చెడ్డపేరు రానివ్వకుండా పనిచేస్తానని చెప్పారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే చెబుతారనీ, అందులో భాగంగానే ఆడంబరాలకు దూరంగా ఉండాలన్న లక్ష్యంతోనే ఎలాంటి స్వాగత ర్యాలీలు లేకుండా సోమవారం సాదాసీదాగా ఇంటికి వచ్చానని చెప్పారు. నేటి నుంచే పనులు పరుగులు పెట్టుడే.. కరీంనగర్‌కు స్మార్ట్‌ సిటీ సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు దక్కుతుందని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ స్మార్ట్‌సిటీ పనులు నిలిచి పోయాయనీ, బుధవారం నుంచి పరుగులు పెడుతాయని స్పష్టం చేశారు. స్మార్ట్‌ సిటీ పనుల టెండర్లకు అడ్డంకులను తొలగించి సదరు కాంట్రాక్టర్లకు ఆర్డర్‌ ఇచ్చామనీ, బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇందులో ఎవరికి ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదన్నారు. అలాగే 350 కోట్లతో ముఖ్యమంత్రి అస్యూరెన్స్‌ కింద పనులు మొదలుపెట్టామనీ, వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామన్నారు. వచ్చే దసరా నుంచే ఐటీ టవర్‌ను ఆచరణలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనీ, మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించి, ఆసమయం నాటికే కంపెనీలతో మాట్లాడుతామని తెలిపారు. షిఫ్ట్‌కు 1200 మంది చొప్పున పనిచేయవచ్చనీ, ఆ లెక్కన మూడు షిప్టులు నడుస్తాయని చెప్పారు. తన అంచనా ప్రకారం 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనీ, మన బిడ్డలు మన కళ్ల ముందే ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించిన ఘతన మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. అలాగే కేసీఆర్‌ ఐలాండ్‌తోపాటు కేబుల్‌ బ్రిడ్జి, బీసీ స్టడీ సర్కిల్‌, సిరిసిల్ల-బావుపేట నాలుగు లైన్ల రోడ్డు, కరీంగనర్‌ ఎలగందుల నాలుగులైన్ల రోడ్ల పనులను వీలైనంత తొందరగా పూర్తిచేస్తామన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను కరీంనగర్‌కు తెస్తారా? అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారనీ, తన వంతు ప్రయత్నం కూడా చేస్తామని సమాధానం ఇచ్చారు. విలేకరుల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జడ్పీ అధ్యక్షురాలు విజయ, సూడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంఎఫ్‌సీ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్‌, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ల రమేశ్‌, ఎంపీపీలు లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణగౌడ్‌, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులు వై సునీల్‌రావు, చల్లా హరిశంకర్‌, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
More