పంచాయతీలకు పైసలొచ్చినయ్‌..

గ్రామ పంచాయతీలకు పైసలొచ్చినయ్‌.. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలవుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు వచ్చినయ్‌. 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 6.10 కోట్ల నిధులకుతోడు రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) నుంచి మరో 4.08 కోట్లు ఆయా ట్రెజరీలకు విడుదల చేశారు. ట్రెజరీ అధికారులు పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్న భావిస్తున్నారు. (కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):పంచాయతీ రాజ్‌ చట్టం-2018 తర్వాత గ్రామాల అభివృద్ధి వేగవంతం చేసేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్రం ఎప్పటికప్పుడు గ్రాంట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కూడా పంచాయతీలకు నేరుగా ప్రతి నెలా నిధులు విడుదల చేయాలని సంకల్పించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంస్థ నిధులను విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా విడుదలైన ఈ నిధులు ప్రస్తుతం ఆయా ట్రెజరీల్లో జమ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నిధులు పంచాయతీలకు ఆర్థికంగా చేయూత నివ్వనున్నాయి. జనాభా ప్రాతిపదికన విడుదలయ్యే ఈ నిధులతో గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక కార్యాచరణకు ఉపయోగపడనున్నాయి. అనేక గ్రామాల్లో 70 శాతానికి పైగా ఆస్థి పన్నులు వసూలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఈ గ్రాంట్లు గ్రామాల సత్వర అభివృద్ధికి దోహద పడుతాయి. 10.19 కోట్లు విడుదల.. జిల్లాలో 313 పంచాయతీలు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద 6 కోట్ల 10 లక్షల 28 వేలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి 4 కోట్ల 8 లక్షల 86 వేల చొప్పున సుమారు 10.19 కోట్లు ఇప్పటికే విడుదల చేశారు. 14వ ఆర్థిక సంఘం నుంచి ట్రెజరీల వారీగా చూస్తే కరీంనగర్‌ ఎస్టీఓలో 2కోట్ల 73 లక్షల 1,114, గంగాధర ఎస్టీఓలో 97,35,724, హుజూరాబాద్‌ ఎస్టీఓలో కోటి 26 లక్షల 5 వేల 647, జమ్మికుంట ఎస్టీఓలో కోటి 13 లక్షల 85 వేల 515 చొప్పున విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి కరీంనగర్‌ ఎస్టీఓలో కోటి 82 లక్షల 90 వేల 512, గంగాధర ఎస్టీఓలో 65,22,496, హుజూరాబాద్‌ ఎస్టీఓలో 84,45,212, జమ్మికుంట ఎస్టీఓలో 76,27,780 చొప్పున జమ చేశారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More