యూరియా కొరత లేదు..

-నిజామాబాద్ నుంచి 1,200 మెట్రిక్ టన్నులు -1,300 మెట్రిక్ టన్నుల కోరమాండల్ యూరియా రేక్ రాక -కరీంనగర్ నుంచి 600 మెట్రిక్ టన్నుల కేటాయింపు -రైతులు ఒకేసారి కొనుగోలు చేయడంతో సమస్య : వ్యవసాయశాఖ అధికారులు మంచిర్యాల అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతున్నది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలకు మించి రికార్డు స్థాయిలో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది 2.90 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో 1.40 లక్షల ఎకరాల్లో పత్తి, 1.45 లక్షల ఎకరాల్లో వరి, 5వేల ఎకరాల్లో వివిధ పప్పు దినుసులు సాగవుతున్నాయి. పంటలకు కావాల్సిన యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులను రైతులు విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన సాగు దృష్ట్యా 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 14 వేల మెట్రిక్ టన్నులు వివిధ మండలాలకు సరఫరా చేశారు. మండలాల్లో విస్తీర్ణం ఆధారంగా అవసరాల మేరకు యూరియాను వ్యవసాయాధికారులు నేరుగా సరఫరా చేసేందుకు అన్ని ప్రణాళికలు రూపొందించారు. ఒకేసారి కొనుగోలు చేస్తున్న రైతులు మొదటి దఫా, రెండో దఫాలకు అవసరమైన యూరియాను రైతులు ఒకేసారి కొనుగోలు చేస్తుండటంతో కొరత ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దఫా దఫాలుగా కొనుగోలు చేసుకొని వాడటం వల్ల రైతులకు ఇబ్బంది ఉండదు. సాధారణంగా రైతులు సాగు సమయంలో ఎకరాకు 90 కిలోల చొప్పున యూరియా ఉపయోగించాలి. కానీ రైతులు ప్రస్తుతం వస్తున్న వార్తల నేపథ్యంలో రానున్న రోజుల్లో యూరియా దొరుకుతుందో, లేదోనని అపోహతో ఒకేసారి కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొరత ఏర్పడుతుంది. సాగైన పంటకు, సరఫరా అయిన బస్తాలు సమానంగా ఉన్నప్పటికీ ఒకే రైతు వద్ద ఎక్కువ మూలన పడి ఉండటంతో ఇతర రైతులకు కొరత ఏర్పడుతుంది. నేడు జిల్లాకు 3,100 మెట్రిక్ టన్నుల యూరియా రాక జిల్లాకు మంగళవారం 3,100 మెట్రిక్ టన్నుల యూరియా చేరనుంది. నిజామాబాద్ జిల్లా నుంచి 1,200 మెట్రిక్ టన్నులు అలాట్ అయ్యింది. సోమవారం సాయంత్రం నిజామాబాద్‌కు రైలు ద్వారా చేరుకోగా.. రాత్రికి లోడై మంగళవారం ఉదయానికి జిల్లాలోని పలు మండలాలకు చేరనుంది. అలాగే 1,300 మెట్రిక్ టన్నుల యూరియా కోరమాండల్ కంపెనీ నుంచి నేరుగా మంచిర్యాలకు రైలు వ్యాగన్ల ద్వారా అందనుంది. మరోవైపు కరీంనగర్ జిల్లాకు ఎన్‌ఎఫ్‌ఎల్ కంపెనీ యూరియా మంగళవారం రానుంది. అందులో నుంచి మంచిర్యాల జిల్లాకు 600 మెట్రిక్ టన్నుల యూరియా అలాట్ అయ్యింది. కరీంనగర్ నుంచి లారీల ద్వారా సోమవారం సాయంత్రానికి మంచిర్యాలకు చేరుకోనుంది. జిల్లాలోని రైతులకు అవసరమైన యూరి యా కంటే అదనంగా మంగళవారం జిల్లాకు యూరియా చేరనుంది.
More