నలుగురు అటవీ అధికారుల సస్పెన్షన్

-ఆసిఫాబాద్‌లో ముగ్గురు, మంచిర్యాలలో ఒకరు -కలప అక్రమ రవాణా అరికట్టడంలో నిర్లక్ష్యం జన్నారం : విధుల్లో నిర్లక్ష్యం చూపిన అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేశారు. కవ్వాల్ అడవుల్లో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసిఫాబాద్ డివిజన్‌కు చెందిన సెక్షన్ ఆఫీసర్లు వినయ్‌కుమార్, రవికుమార్, బీట్ ఆఫీసర్ జే లక్ష్మణ్‌ను ఆసిఫాబాద్ అటవీ శాఖ జిల్లా అధికారి రంజిత్‌నాయక్ సస్పెండ్ చేశారు. జన్నారం డివిజన్‌లో చింతగూడ బీట్ ఆఫీసర్ మక్బూల్‌ను ఎఫ్‌డీవో మాధవరావు సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 3న జన్నారం రేంజ్ పరిధిలోని చింతగూడ బీట్‌లో అక్రమంగా నిల్వ చేసిన రూ. 46 వేల విలువైన కలపను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈకలప ఎక్కడి నుంచి తెచ్చి నిల్వ చేశారనే కోణంలో నిర్మల్ ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు ఈ నెల 4న జన్నారం అటవీ డివిజన్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్ పరిధిలో తనిఖీలు చేశారు. ఆసిఫాబాద్ డివిజన్ గిన్నెదరి రేంజ్‌లోని మల్యాల సెక్షన్ 2 అడవిలో చెట్లను నరికిన మొదళ్లను గుర్తించారు. అక్కడి నుంచే స్మగ్లర్లు కలపను దిమ్మెలుగా తయారు చేసి గోదావరి మీదుగా కరీంనగర్ జిల్లాకు తరలించడానికి చింతగూడ అడవిలో టేకు దుంగలను దాచినట్లు సమాచారం అందుకున్న జన్నారం రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రావు సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారు. దాచిన దుంగలను స్వాధీనం చేసుకున్నరు. నిర్మల్ జిల్లా కన్జర్వేటర్ వినోద్‌కుమార్ అదేశాల మేరకు నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు ఎఫ్‌డీఓ మాధవరావు తెలిపారు.
More