లెక్క చెప్పాల్సిందే...

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించేందుకు నేడు చివరి రోజు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో కచ్చితంగా ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వారిపై చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు మే నెలలో మూడు విడతల్లో నిర్వహించారు. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. ఈ లెక్కల సమర్పణకు నేడు చివరి తేదీ కానుంది. స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాల ను ఎలక్షన్ కమిషన్‌కు అప్పగించే సమయం నేటితో ముగియనుంది. ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని వారిపై తక్షణమే వేటు తప్పదని అధికారులు వెల్లడించారు. అధికారుల ప్రకటనతో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. నేటితో చివరి రోజు కావడంతో పోటీదారులు అంతా నేడు ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వైపు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలు ముగినప్పటి నుంచి 45 రోజుల్లో ఖర్చుల వివరాలు అందించాల్సి ఉంటుంది. కానీ నేటికి చాలా మంది లెక్కలు అప్పగించడంలో తీవ్ర జాప్యం చేశారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెల్లడించిన తేదీ నుంచి 45 రోజులు కావడంతో ఎన్నికల వివరాలు అప్పగించేందుకు ఈ నెల 18వ తేదీ చివరి తేదీ కానుంది. అప్పగించకుంటే ఎన్నిక రద్దు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మే 6న మొదటి విడత ఎన్నికల్లో 27 మంది జడ్పీటీసీ స్థానాలకు, 169 ఎంపీటీసీ స్థానాలకు, మే 10న జరిగిన రెండో ఎన్నికల్లో 22 మంది జడ్పీటీసీ స్థానాలకు, 130 ఎంపీటీసీ స్థానాలకు, మే 14న జరిగిన మూడో విడత ఎన్నికల్లో 17 మంది జడ్పీటీసీ స్థానాలకు, 139 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు పోటీ చేశారు. ఫలితాలు వెల్లడించిన 45 రోజుల్లో ఎప్పుడైనా లెక్కలు అప్పజెప్పాలి. కానీ, ఇప్పటి వరకు చాలా మంది లెక్కలు అప్పజెప్పలేదు. వీరిలో చాలా మంది జాప్యం చేశారు. లెక్కలు చూపని వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. గత ఎన్నికల్లో లెక్కలు చూపని వారిపై పోటీ చేయకుండా వేటు కూడా వేసింది. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు లెక్కలు అప్పగించకుంటే వారి ఎన్నిక రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఓడిపోయిన అభ్యర్థులు లెక్కలు చెప్పకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయంకుడా అనర్హులుగా ప్రకటిస్తారు. ధ్రువీకరణ తప్పనిసరి... ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ లెక్కల వివరాలను స్థానిక మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీవోలకు, జడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయాల్లోని సీఈవోలకు అప్పగించాల్సి ఉంటుంది. వివరాల వెల్లడికి ఒక్కరోజే మిగలడంతో పోటీ చేసిన అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా అధికారుల సూచనల మేరకు లెక్కల వివరాలు అప్పగించి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రూ. 1.50 లక్షలు, జడ్పీటీసీ ఒక్కో స్థానానికి రూ. 4 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకే లెక్కలు చూపి వివరాలు అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం లెక్కలు చూపి పత్రాలను అధికారులు అప్పగించడమే కాకుండా, సమర్పించిన పత్రాలను వాటి వివరానలు అధికారులకు వివరించి ధ్రువీకరించుకోవాలి.
More