నేడు గురు పౌర్ణిమ

కరీంనగర్ కల్చరల్: వ్యాస పౌర్ణమి, గురుపౌర్ణమిగా పిలిచే విశిష్ట దినాన్ని జిల్లావ్యాప్తంగా మంగళవారం జరుపుకోనున్నారు. వ్యాస మహర్షిని తొలి గురువుగా, జగద్గురువుగా పూజించడం సాంప్రదాయంగా వసున్నది. గురుపరంపరను పాటించే వారు తప్పనిసరిగా వారి గురువు ఎక్కడున్నా వెళ్లి ఈ రోజు కలిసి గురుపూజ జరిపి ఆశీస్సులు పొందుతారు, సన్మానాలు చేస్తారు. ఆలయాల్లో వ్యాసపూజలు, అభిషేకాలు జరుపుతారు. వ్యాస పౌర్ణమినాడు నదీ స్నానాలాచరించి గురుస్మరణతోపాటు గురువు ఉపదేశించిన స్ర్తోత్రాలు, మంత్రాలు, పారాయణాలు చేస్తే సిద్ధ్ది పొందుతారని శాస్త్ర ప్రమాణం. పాక్షిక చంద్రగ్రణం.. మంగళవారం దేశమంతటా పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. రాత్రి 1.19 గంటలకు గ్రహణ స్పర్శకాలం కాగా, 2.08 గంటలకు నిమీలనకాలం, మధ్యకాలం 3 గంటలకు, ఉన్మీలకాలం 3.48 గంటల వరకు, తెల్లవారుజామున 4.44 గంటలకు గ్రహణం పూర్తవుతుంది. కాగా, మొత్తం 3 గంటల 25 నిమిషాలపాటు గ్రహణం ఉండనుంది. ఈ గ్రహణం ఉపాసనాపరులకు ఎంతో మంచి కాలంగా చెబుతున్నారు. ఉత్తరాషాడ నక్షత్రం, ధనస్సు, మకర, మేష, వృషభ, మిథునరాశుల వారు గ్రహణం చూడకపోవడం మంచిదని జ్యోతిష పండితులు చెబుతున్నారు. శుద్ధబింబ అనంతరం యధావిధిగా సంప్రోక్షణ, తదితర కార్యక్రమాలు జరుపుకోవచ్చు. అలాగే, 16న మధ్యాహ్నం యధావిధిగా ప్రత్యబ్దీకాదులు జరుపుకోవచ్చని పండితులు వివరించారు.
More