త్వరలోనే ఇంటింటికీ భగీరథ నీరు

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ:కరీంనగరంలో త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం నగరంలోని 22, 30వ డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఎక్కడా నిధులకు కొరత లేదన్నారు. పనులను కాంట్రాక్టర్లు వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో శివారు కాలనీలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థలకు నేరుగా ప్రతి ఏటా వంద కోట్ల నిధులు ఇచ్చిందని తెలిపారు. ఇలా నగరపాలక సంస్థకు మూడేళ్లలో రూ.350 కోట్ల నిధులు వచ్చాయని వెల్లడించారు. ఇప్పటికే వంద కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయనీ, మరికొన్ని టెండర్ దశల్లో ఉన్నాయని చెప్పారు. నెలల తరబడిగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు సాధ్యమైనంత ఎక్కువ పనులు పూర్తి చేయిస్తామన్నారు. గతంలో సీసీ రోడ్డు వేస్తే కొన్ని రోజులకే పైపులైన్లు, ఇతర పనుల కోసం అంటూ తవ్వేవారనీ, కానీ ఇప్పుడు ముందుగానే మంచినీటి పైపులైన్లు, యూజీడీ పైపులైన్లు పూర్తి చేసి రోడ్లను వేయిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని ప్రజల్ని కోరారు. తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్, నాయకులు చొప్పరి జయశ్రీ, గూడూరి మురళీ, వై సునీల్‌రావు, తోట రాములు, తోట మధు, నారాయణ, కిషోర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: