బ్రిటన్ పార్లమెంట్ గోడను ఢీకొట్టిన కారు

లండన్: బ్రిటన్ పార్లమెంట్ రక్షణ గోడను ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో చాలా మంది పాదచారులు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. గాయపడిన వాళ్లలో ఎవరూ ప్రాణాపాయ పరిస్థితుల్లో లేరని పోలీసులు చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇది ఉగ్రవాద చర్యనా కాదా అన్న విషయంపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడున్నర గంటలకు ఈ ఘటన జరిగింది. కారుతో వేగంగా వచ్చి పార్లమెంట్ రక్షణ గోడను ఢీకొట్టడంతో పక్కనే ఉన్న పాదచారులు, సైక్లిస్టులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పోలీసులు వెస్ట్‌మిన్‌స్టర్ ట్యూబ్ స్టేషన్‌ను మూసేశారు. సమీపంలోని మిల్‌బ్యాంక్, పార్లమెంట్ స్కేర్, విక్టోరియా టవర్ గార్డెన్స్ వీధులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే సదరు కారు డ్రైవర్ కావాలనే పార్లమెంట్ రక్షణ గోడను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఓ వ్యక్తి చిన్నకారులో వేగంగా వచ్చి అక్కడున్న సైక్లిస్టుపైకి దూసుకెళ్లడంతోపాటు పార్లమెంట్ రక్షణ గోడను ఢీకొట్టాడు. అతడు కావాలనే ఆ పని చేసినట్లు అనిపించింది అని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. చాలా వేగంగా రక్షణ గోడవైపే కారు దూసుకురావడాన్ని తాను చూసినట్లు మరో ప్రత్యక్ష సాక్షి తెలిపింది. అసలు ఢీకొట్టిన కారు ముందు భాగంలో రిజస్ట్రేషన్ నంబర్ కూడా లేనట్లు ఆమె వెల్లడించింది.

Related Stories: