ఐదేళ్లలో ఐదొందల కార్ల దొంగతనం

ఢిల్లీ: వెండితెర యాక్షన్‌కు ఏ మాత్రం తీసిపోని నేరం. ఓ వ్యక్తి గత ఐదేళ్లలో 500 విలాసవంతమైన కార్లను దొంగిలించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు ఇతగాడి తలపై రూ. లక్ష రివార్డును సైతం ప్రకటించారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. సఫ్రుద్దీన్(29). నార్త్ ఢిల్లీలోని నంద్‌నగ్రీ ప్రాంత నివాసి. లగ్జరీ కార్లను దొంగిలించి పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో విక్రయించేవాడు. పోలీసులకు అనుమానం రాకుండా చోరీని పక్కాగా ప్లాన్ చేసేవాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చి చోరీ అనంతరం తిరిగి ఆకాశయానంలోనే హైదరాబాద్‌కు చేరుకునేవాడు. ఇతడికి సహాయంగా నలుగురు సభ్యుల ముఠా ఉంది. ఏడాదికి వంద లగ్జరీ కార్లను దొంగిలించాలనేది ఇతగాడి లక్ష్యమట. ఎంపిక చేసిన కార్ల సాఫ్ట్‌వేర్‌ను బ్రేక్ చేసేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించేటప్పుడు ల్యాప్‌టాప్, హైటెక్ గాడ్జెట్స్, జీపీఎస్, సెంట్రలైజ్‌డ్ లాకింగ్ సిస్టంను వెంటతీసుకువెళ్లేవాడని డీసీపీ రాజేశ్ దియో వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్ నీరజ్ చౌదరీ, సబ్ ఇన్‌స్పెక్టర్ కుల్దీప్.. గగన్ సినిమా వద్ద ఓ కారును ఆపాల్సిందిగా పేర్కొన్నారు. ఈ క్రమంలో కారు డ్రైవర్‌ను సఫ్రుద్దీన్‌గా గుర్తించారు. పోలీసుల గుర్తింపుతో సఫ్రుద్దీన్ అప్రమత్తమై కారును పరుగు తీయించాడు. 50 కిలోమీటర్ల ఛేజ్ అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గడిచిన జూన్ 5వ తేదీన నలుగురు సభ్యులుగా గల సఫ్రుద్దీన్ ముఠా వివేక్ విహార్ ప్రాంతంలో పోలీసులపై కాల్పులకు తెగబడింది. పోలీసులు ప్రతిగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో సఫ్రుద్దీన్ సహాయకుడు నూర్ మహ్మద్ చనిపోయాడు. రవి కుల్దీప్ అనే మరో సహాయకుడిని అరెస్ట్ చేశారు.

Related Stories: