ఫేస్‌బుక్ మాయలో పడి.. పిల్లలను పట్టించుకోవడం లేదని..

న్యూఢిల్లీ : కొంతమంది అయితే సోషల్ మీడియాతోనే తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. సోషల్ మీడియా మాయలో పడి కుటుంబ సభ్యులను కూడా మరిచిపోతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ మాయలో పడి.. భర్తను, పిల్లలను పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్న భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ఈ నెల 12న చోటు చేసుకుంది. హరి ఓం(35), లక్ష్మీ(32) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరి ఓం వృత్తిరీత్యా కంప్యూటర్ రిపేర్ షాపును నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం భార్యకు హరి స్మార్ట్ ఫోన్ ఇప్పించాడు. దీంతో ఆవిడ నిత్యం ఫోన్‌తో బిజీగా ఉంటుంది. భర్తను, పిల్లలను పట్టించుకోకుండా.. వాట్సాప్, ఫేస్‌బుక్‌లో చాట్ చేస్తుంది. ఇంటి సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్న భార్యపై భర్త కోపం పెంచుకున్నాడు. ఫేస్‌బుక్ ద్వారా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు హరి అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి హరి, లక్ష్మీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త.. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. శుక్రవారం ఉదయం లక్ష్మీ తండ్రి వారి ఇంటికి వచ్చాడు. కూతురు బెడ్‌పై శవమై కనిపించేసరికి తండ్రి బల్వంత్ సింగ్ తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హరిఓంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Stories: