పట్టాల మధ్య పడుకొని బతికి బయటపడ్డాడు

-పైనుంచి గూడ్స్ వెళ్లినా ప్రాణాలతో సురక్షితం -వైరల్‌గా మారిన వీడియో.. అనంతపురం జిల్లాలో ఘటన
అనంతపురం: చిన్న నిర్లక్ష్యంతో పెను ప్రమాదాన్ని ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డాడో వ్యక్తి. పట్టాల మధ్యలో పడుకున్న అతడి పైనుంచి గూడ్స్ రైలు వెళ్లినా బతికి బట్టకట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అనంతపురం రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై క్రాసింగ్ కోసం గూడ్స్ రైలును ఆపారు. ఆ సమయంలో రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై.. లక్నో నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ ప్రయాణికుడు ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చేందుకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని ఎక్కకుండా.. పట్టాలు దాటాలనుకున్నాడు. ఈ క్రమంలో గూడ్స్ రైలు కిందకు దూరాడు. ఇంతలో రైలు కదిలింది. ఎటూ వెళ్లలేనిస్థితిలో అరచేతిలో ప్రాణాలు పట్టుకుని గూడ్స్‌రైలు కిందే రెండు పట్టాల మధ్య పడుకున్నాడు. రైలు వెళ్లగానే ప్రయాణికుడు లేచి వెళ్లిపోయాడు.

Related Stories: