బాల్క సుమన్‌పై దాడికి యత్నం

-పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి.. -మంటలతో సుమన్‌పైకి దూసుకొచ్చేందుకు యత్నం -మంచిర్యాల జిల్లా ఇందారంలో ఘటన
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ లక్ష్యంగా దాడికి యత్నం జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని బాల్క సుమన్ వైపు దూసుకొచ్చేందుకు యత్నించాడు. ఈ దాడి నుంచి సుమన్ సురక్షితంగా బయటపడగా పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో కలిసి బుధవారం ఇందారంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రేగుంట గట్టయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని.. నిప్పంటించుకొని సుమన్ వైపు దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురు మీడియా ప్రతినిధులకు.. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట మంచిర్యాలలోని ప్రైవేట్ దవాఖానకు తరలించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. జైపూర్ మండలం శివ్వారం మాజీ సర్పంచ్ విశ్వంబర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు గట్టయ్యపై 307 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

చెన్నూరు అభివృద్ధి కోసం చావడానికైనా సిద్ధం

చెన్నూరు అభివృద్ధి చెందుతుందంటే తాను చావడానికైనా సిద్ధమని ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. మరో వర్గం బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తాను చెన్నూరులో పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. ఈనెల 14నుంచి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు.