మరణశిక్షను రద్దు చేసిన మలేసియా

కౌలాలంపూర్ : మరణశిక్షను రద్దు చేసిన దేశాల సరసన ఇప్పుడు మలేసియా చేరబోతోంది. మరణశిక్షలను ఇకపై అమలుచేయమని, మరణశిక్షను రద్దు చేస్తున్నామని మలేసియా ప్రకటించింది. ఇప్పటికే కోర్టులు తీర్పు ఇచ్చిన కేసుల్లో కూడా మరణశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు స్పష్టంచేసింది. ఆ దేశ న్యాయశాఖ మంత్రి లియ్ వుయ్ కేంగ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మరణశిక్షలను రద్దుచేయాలన్న నిర్ణయాన్ని క్యాబినెట్ కూడా ఆమోదించిందని, సోమవారం పార్లమెంట్ తిరిగి సమావేశమవగానే మరణశిక్ష రద్దుపై చట్టం తీసుకువస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరణశిక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మలేసియా సమాచారశాఖ మంత్రి గోవింద్‌సింగ్ డియో పేర్కొన్నారు. ఆసియా దేశాల్లోనే తొలిసారి మరణశిక్ష రద్దుపై మలేసియా నిర్ణయం తీసుకోవడంపట్ల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రస్తుతం మలేసియాలో 1,200 పైగా వ్యక్తులకు మరణశిక్షను అమలుచేయాల్సి ఉండగా.. వారందరికీ ప్రస్తుతం ఉపశమనం లభించనుంది.
× RELATED మలేసియా రాజును పెళ్లాడిన మాస్కో మాజీ బ్యూటీక్వీన్