గీతా ఆర్ట్స్ నిర్మాణంలో

అర్జున్‌రెడ్డి సినిమాతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అర్జున్‌రెడ్డి తర్వాత సందీప్‌రెడ్డి వంగా తెలుగులో తన తదుపరి చిత్రాన్ని అగ్ర హీరో మహేష్‌బాబుతో చేయనున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వినూత్నమైన పాయింట్‌తో సందీప్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్‌బాబు సినిమా చేయడానికి సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లు తెలిసింది. గీతా ఆర్ట్స్ సంస్థలో మహేష్‌బాబు నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన స్కిప్ట్ వర్క్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు మహర్షి సినిమా చేస్తున్నారు. అనంతరం సుకుమార్‌తో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత సందీప్‌రెడ్డి సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తారని సమాచారం.