ఆన్‌లైన్‌లో 'మ‌హ‌ర్షి'షూటింగ్ పిక్స్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న 25వ చిత్రంగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా చిత్ర ఫ‌స్ట్‌లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇందులో మ‌హేష్ గత సినిమాల క‌న్నా భిన్నంగా క‌నిపించాడు. మీసం, గెడ్డంతో స్టైలిష్ లుక్‌లో మ‌హేష్ మెరిసిపోయాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించిన షూటింగ్ పిక్స్ ఈ మ‌ధ్య ఆన్‌లైన్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నిర్మాత‌లు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా లొకేష‌న్ పిక్స్ బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని ఏజీ కాల‌నీలో జ‌రుగుతుండ‌గా, మ‌హేష్‌, వెన్నెల కిషోర్, అల్ల‌రి న‌రేష్‌ల‌కి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫోటోల‌లో మ‌హేష్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు . దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?