పోరాడి సాధించుకున్న మరాఠాలు

-రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం -రాష్ట్ర బీసీ కమిషన్ సిఫారసు నేపథ్యంలో చర్యలు
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం గత ఏడాది కాలంగా మహారాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో కదం తొక్కిన మరాఠాలు ఎట్టకేలకు తమ జీవితకాలపు ఆకాంక్ష అయిన రిజర్వేషన్లను దక్కించుకున్నారు. మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదముద్ర వేసింది. మహారాష్ట్ర స్టేట్ బీసీ కమిషన్ సిఫారసు మేరకు మరాఠాలకు రిజర్వేషన్లను కల్పించింది. అయితే ఎంతశాతం రిజర్వేషన్ కల్పించాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని బీసీ కమిషన్ వెల్లడించింది. వారికి సరైన ప్రాతినిధ్యం లభించనందున సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎస్‌ఈబీసీ) విభాగంలో16 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. బీసీ కమిషన్ సూచన మేరకు మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరుతాయి. బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక మాకు అందింది. ఎస్‌ఈబీసీ విభాగంలో మరాఠాలకు రిజర్వేషన్ కల్పిస్తాం. దీనిపై క్యాబినెట్ సబ్‌కమిటీని నియమిస్తాం అని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు.

Related Stories: