జూలై 7 నుంచి 22 వ‌ర‌కు మ‌హాంకాళి అమ్మ‌వారి జాత‌ర‌

హైద‌రాబాద్ : తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో అన్నిఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోనాల జాత‌ర వివ‌రాల‌ను, ఏర్పాట్ల‌ను దేవాదాయ శాఖ అధికారులు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి వివ‌రించారు. సికింద్ర‌బాద్ ఉజ్జ‌యిని మ‌హాంకాళి అమ్మ‌వారి జాత‌ర జూలై 7వ తేదీ నుంచి 22 వరకు జర‌గ‌నుంద‌ని, 7న ఘ‌ట‌ము ఎదుర్కోలు, 21న బోనాలు, 22న రంగం ఉంటుంద‌ని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సంద‌ర్బంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ... మహాంకాళి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఎన్ని నిధులైనా ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు సరిపడా తాగునీటి ప్యాకెట్లను, ప్ర‌సాదాల‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రి అల్లోల‌ను ఆశీర్వదించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో అన్న‌పూర్ణ‌, వేద‌పండితులు పాల్గొన్నారు.

Related Stories: