చిత్ర విడుదల ఆపాలని కోర్టుకెక్కిన మగధీర

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ బేనర్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అనేక రికార్డులు సాధించింది. అయితే ఈ మూవీని బాలీవుడ్ లోను రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కాని రీమేక్ రైట్స్ దక్కించుకున్న మధు మంతెన మాత్రం ఇప్ప‌టికి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. కాక పోతే ఇదే థీమ్ తో బాలీవుడ్ లో రాబ్తా అనే మూవీ తెరకెక్కించడంతో మగధీర చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ నిర్మాత‌లు కోర్టు మెట్లు ఎక్కారని అంటున్నారు. దినేష్‌ జైన్ దర్శకత్వంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – కృతి సనన్ జంటగా నటించిన చిత్రం రాబ్తా. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ , టీజర్స్ విడుదల కాగా ఇందులోని సన్నివేశాలు మగధీరకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాబ్తా చిత్రం మగధీరకి అనధికారిక కాపీ టాక్ నడుస్తుండగా, కాపీ రైట్ చట్టం ప్రకారం గీతా ఆర్ట్స్ చిత్ర రిలీజ్ ని అడ్డుకోవాలని కేసు వేసిందట. దీనిపై విచారణని జరిపిన కోర్టు రాబ్తా చిత్ర యూనిట్ కి నోటీసులు పంపినట్టు సమాచారం. జూన్ 1 న తదుపరి విచారణ జరగనుందని తెలుస్తుండగా, రాబ్తా మూవీ జూన్ 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మరి ఈ లోపు సమస్యలన్నింటిని సద్దుమణిగేలా చేసుకొని మూవీ రిలీజ్ కి మార్గం సుగమం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.
× RELATED శృంగారానికి ఒప్పుకోలేదని ట్రాన్స్‌జెండర్‌పై కాల్పులు