ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణకు అన్యాయం..

ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది ప్రచారంలో భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి: తెలంగాణ ప్రాంతం ఆంధ్రా పాలకుల వల్ల అన్యాయానికి గురవుతోందని అందుకే మన పాలన మనకే కావాలని పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని ములుకలపల్లి, కొర్కిశాల, పోతుగల్లు, ఇప్పలపల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, గణేశ్‌పల్లి గ్రామాల్లో భూపాలపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ పాలనను ఇతర దేశాలు, రాష్ర్టాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో అనేక పార్టీల నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. అభివృద్ధిని ఓర్వలేని ప్రతి పక్షాలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. వారి కుట్రలకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, నల్లభీం మల్లయ్య, దండ వెంకటేశ్వర్‌రెడ్డి, నరహరి బక్కిరెడ్డి, వేముల చంద్రమౌళి, దానవేన రాములు, శ్రీనివాస్, సుమన్, సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: