లావా వల్లే చంద్రుడిపై సుడులు

వాషింగ్టన్, సెప్టెంబర్ 9: చంద్రుడిపై నీటి ప్రవాహాలు, సుడుల మాదిరిగా ఉన్న గుర్తులు లావా వల్ల ఏర్పడి ఉండొచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రుడిపై ఉండే చీకటి ప్రాంతాల్లో ఈ సుడులు ప్రకాశవంతంగా మెరుస్తూ అందమైన పెయింటింగ్‌లాగా కనిపిస్తూ ఉంటాయి. రెయినర్ గామా అని పిలిచే భారీ సుడి ఏకంగా 65 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నవి. ఇవన్నీ దాదాపు 100-250 కోట్ల ఏండ్ల కిందట ఏర్పడ్డాయని అంచనా. వీటి వద్ద అయస్కాంత క్షేత్రాలు బలంగా ఉంటాయి. అయితే ఇవి ఎలా ఏర్పడ్డాయో ఇప్పటికీ నిరూపణ కాలేదు. కొందరు నీటి ప్రవాహాల వల్ల ఏర్పడ్డాయని, మరికొందరు గాలి కోత కారణంగా రూపుదిద్దుకున్నాయని, మరికొందరు ఉపరితలం కింది పొరల్లో మార్పుల వల్ల భిన్న రకాల ఆకారాలు ఏర్పడ్డాయని ప్రతిపాదించారు. తాజాగా అమెరికాలోని రట్గెర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చంద్రుడిపై ఉన్న అగ్నిపర్వతాలు గతంలో బద్ధలైనప్పుడు లావా పొంగి ప్రవహించడం వల్ల ఈ సుడులు ఏర్పడ్డాయని ప్రతిపాదించారు. అగ్నిపర్వతాలు, సుడులు ఉన్న ప్రదేశాలను కంప్యూటర్ సాయంతో విశ్లేషించి లావా ప్రవహించిన మార్గాల్లోనే ఇవి ఉన్నట్టు తేల్చారు. చంద్రుడిపై ఉన్న రాళ్లను ఆక్సిజన్ లేని వాతావరణంలో 600 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడిచేస్తే అవి అయస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. దీనిని బట్టి సుడులు ఉన్న ప్రాంతంలో లావా ప్రభావం వల్ల ఉపరితలం వేడెక్కి అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తున్నది అని పరిశోధక బృంద సభ్యురాలు సోనియా టిక్కో తెలిపారు. వీరి పరిశోధన వ్యాసం జియోఫిజికల్ రీసెర్చ్: ప్లానెట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Related Stories: