ఎవరికీ వద్దు.. శబరిమలను పులులకు వదిలేద్దాం

శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనుకూల, వ్యతిరేక వర్గాలు తలపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఓ పర్యావరణవేత్త పూర్తి భిన్నమైన ధోరణిలో స్పందించారు. మగవాళ్లు వద్దు, ఆడవాళ్లు వద్దు, అది పులుల అభయారణ్యం.. పులులకే వదిలేద్దాం అని కొత్తప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఆయన పేరు అచ్యుతన్. వరదల తర్వాత కేరళ అతలాకుతలమైపోయింది. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కేరళ పునర్నిర్మాణం గురించి. కానీ అందరూ ఓ చిన్న విషయంంపై సమయాన్ని, శక్తిని, వనరులను వృథా చేసుకుంటున్నారని ఆయన పెదవి విరిచారు. రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎంపీఐ) ఆధ్వరంలో వరదల అనంతరం కేరళ పునర్నిర్మాణం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో అచ్యుతన్ ప్రసంగించారు. ఓవైపు ప్రకృతి ఉత్పాతంతో కేరళ కుదేలైంది. పర్యావరణం ప్రమాదంలో పడింది. అడవులను విస్తరించలేకపోయినా కనీసం ఉన్నవి కాపాడుకుంటే మంచిదని ఆయన చెప్పారు. శబరిమలపై గతంలో జరిపించిన సర్వేలో అచ్యుతన్ పాల్గొన్నారు. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ అభివద్ధి పేరిట మరిన్ని నిర్మాణాలు చేపడితే గుడికే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.

Related Stories: