మరో ఆర్థిక సంక్షోభం?

అంతర్జాతీయంగా ఆవహిస్తున్న భయాలు.. నిపుణుల మాటల్లో సంకేతాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: మరో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తనుందా?.. లేమన్ బ్రదర్స్ దివాలా నేపథ్యంలో చోటుచేసుకున్న అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి పదేండ్లు పూర్తయిన తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి భయాందోళనలే వినిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం తప్పదని కచ్ఛితంగా చెప్పకున్నా.. నిపుణుల స్వరంలో మాత్రం అందుకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తుండటం గమనార్హం. ఇంతకి ఆర్థిక విశ్లేషకులు ఎలాంటి పరిణామాలను చూసి ఆందోళనకు గురవుతున్నారు.

భారీగా డాలర్ల రుణాలు

అమెరికా డాలర్లు అంతర్జాతీయ కరెన్సీగా ఉండటంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు డాలర్ నిల్వలను పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డాలర్ల రూపంలో భారీగా రుణాలనూ చేస్తున్నాయి. దీంతో అమెరికా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవిధానం ప్రభావం ఇతర అన్ని దేశాలపై సహజంగానే పడుతున్నది. అగ్రరాజ్యంలో వడ్డీరేట్లు పెరిగితే ఈ రుణ భారం కూడా పెరుగుతూ పోతున్నది. ఈ పరిణామం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదంగా మారుతున్నది.

స్టాక్ మార్కెట్ నష్టాలు

స్టాక్ మార్కెట్ల నష్టాలు కూడా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనల్ని సృష్టిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలుగడం (బ్రెగ్జిట్), అమెరికా-చైనా మధ్య తీవ్రతరమైన వాణిజ్య యుద్ధం వంటివి స్టాక్ మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే స్టాక్ సూచీలు వరుస నష్టాల్లోకి జారుకోవడం ఖాయం. కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులూ ఆయా దేశాల ఆర్థిక పరిపుష్ఠిని దెబ్బతీస్తున్నాయి.

నియంతృత్వ లోపాలు-సంక్లిష్ట పెట్టుబడులు

వివిధ రంగాల నియంత్రిత సంస్థల్లో లోపాలు, సంక్లిష్ట పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలను నిరంతరం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విచ్ఛిన్న నియంతృత్వ నిర్మాణం, రిస్క్‌లతో కూడిన పెట్టుబడులు ఎప్పుడూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థల్ని ప్రమాదంలో పడేసేవేనని కొలంబియా విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర అధ్యాపకులు కత్రిన్ జడ్జ్ అన్నారు. ఈ రెండింటి వల్ల త్వరలో మరో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి బీజం పడవచ్చన్న ఆందోళనను వ్యక్తం చేశారు.

విపరీతమైన నగదు ప్రవాహం

2008 సంక్షోభం నుంచి కోలుకోవడంలో భాగంగా ప్రపంచంలోని అన్ని కేంద్ర బ్యాంకులు.. మార్కెట్‌లోకి ద్రవ్య సరఫరాను పెంచేశాయి. పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించాయి. స్టాక్స్, బాండ్స్, ఇతరత్రా ఆస్తుల్లోకి 290 లక్షల కోట్ల డాలర్లు చేరాయి. వడ్డీరేట్లను తక్కువగా ఉంచడంతో మదుపరులు ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా అధిక ప్రయోజనాల కోసం ఎడాపెడా పెట్టుబడులకు దిగారు. ఇదింకా జరుగుతూనే ఉండగా, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నది.