శ్రీదేవి జ్ఞాపకార్థం...

దివంగత నటి శ్రీదేవి జ్ఞాపకార్థం ఆమె విగ్రహాన్ని తమ దేశంలో ప్రతిష్టించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. శ్రీదేవి, రిషికపూర్ కలయికలో 1989లో రూపొందిన చాందిని సినిమా అత్యధికభాగం స్విట్జర్లాండ్‌లోనే చిత్రీకరణ జరుపుకున్నది. ఈ సినిమాలో తమ దేశ ప్రకృతి సోయగాల్ని అందంగా చూపించి పర్యాటకరంగ అభివృద్ధికి తోడ్పడినందుకుగాను శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ సినీ ప్రముఖుల విగ్రహాల్ని స్విట్జర్లాండ్‌లో నెలకొల్పడం ఇదే తొలిసారి కాదు. గతంలో భారత దిగ్గజ దర్శకుడు యశ్‌చోప్రా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించారు.

ఆయన తెరకెక్కించిన సినిమాలన్ని ఎక్కువభాగం స్విట్జర్లాండ్‌లోనే షూటింగ్ జరుపుకున్నాయి. దాంతో ఈ దేశ ప్రభుత్వం 2011లో ఆయన్ని సత్కరించడమే కాకుండా ఓ రైలుతో పాటు లౌనేన్సీ అనే ప్రాంతంలో ఉన్న సరస్సుకు యశ్‌చోప్రా పేరును పెట్టింది. తాజాగా దివంగత శ్రీదేవి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించబోవడం ఆ దేశ సౌహార్థ్ర భావాన్ని చాటుతున్నది. మంత్రమగ్ధుల్ని చేసే ప్రాకృతిక సౌందర్యంతో దర్శకనిర్మాతలకు ఎంతో ఇష్టమైన ప్రాంతంగా స్విట్జర్లాండ్ విరాజిల్లుతున్నది. ఎన్నో తెలుగు చిత్రాలు కూడా అక్కడి సుందర లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్నాయి.

Related Stories: