సదర్‌మాట్, కామారెడ్డి పెద్దచెరువు వారసత్వ నిర్మాణాలు

-తెలంగాణ సాగునీటి వనరులకు కేంద్రం గుర్తింపు -శతాబ్దానికి పైగా తాగు, సాగునీరు అందిస్తున్న వనరులు -కేంద్ర గుర్తింపుపట్ల మంత్రి హరీశ్‌రావు హర్షం -వారసత్వ నిర్మాణాలను పరిరక్షిస్తామని వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఒక సాగునీటి వనరు ఐదారు దశాబ్దాలపాటు మెరుగైన మనుగడ సాధించడమే కష్టం. అలాంటిది.. శతాబ్దానికిపైగా తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తున్న సాగునీటి వనరులకు తెలంగాణలో కొదవలేదు. అటువంటి ఓ రెండు అపురూప సాగునీటి వనరులకు జాతీయ వారసత్వ నిర్మాణాల గుర్తింపు లభించింది. 127 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సదర్‌మాట్ ఆనకట్ట, 121 ఏండ్లుగా ప్రజల్ని ఆదుకుంటున్న కామారెడ్డి పెద్ద చెరువు ఈ ఘనత సాధించాయి. ఈ రెండింటిని వారసత్వ సాగునీటి నిర్మాణాలు (హెచ్‌ఐఎస్) అవార్డుకు ఎంపికచేసినట్టు తెలియజేస్తూ కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరెక్టర్ హరేంద్రసింగ్.. తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ (పరిపాలన) బీ నాగేంద్రరావుకు లేఖరాశారు.

ఈ రెండు జలవనరులు జాతీయ అవార్డుకు ఎంపికకావడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. వాస్తవానికి కెనడాలోని సస్కటూన్‌లో గత నెల 12-17 తేదీల్లో జరిగిన 69వ ఐఈసీ సమావేశంలో వారసత్వ సాగునీటి నిర్మాణాలు ఎంపికచేశారు. ఇందులో భాగంగా తెలంగాణ నీటిపారుదలశాఖ పంపిన ప్రతిపాదనల్ని పరిశీలించి, అందులో సదర్‌మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువును నామినేట్‌చేయగా.. రెండింటికీ అవార్డులు దక్కాయి. ఐఎన్సీఎస్‌డబ్ల్యూ (ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ సర్ఫేస్ వాటర్) సభ్య కార్యదర్శి ఈ అవార్డులను అందుకున్నారు. వాటిని ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో తెలంగాణ నీటిపారుదలశాఖకు అందజేయనున్నారు. అవార్డులను అందుకునే అధికారుల పేర్లను పంపాల్సిందిగా కేంద్ర జలవనరుల సంఘం తెలంగాణ నీటిపారుదల శాఖకు లేఖ రాసింది.

వారసత్వ నిర్మాణాల్ని పరిరక్షిస్తాం: మంత్రి హరీశ్‌రావు

సదర్‌మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువును వారసత్వ సాగునీటి నిర్మాణాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపట్ల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ (పరిపాలన) నాగేంద్రరావు హర్షం వ్యక్తంచేశారు. వారసత్వ నిర్మాణాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఇలాంటి నిర్మాణాలు వందల సంఖ్యలో ఉన్నాయని ఈఎన్సీ నాగేంద్రరావు తెలిపారు. తూములు, మట్టడి, ఆనకట్టలు వందల సంఖ్యలో ఉన్నందున వాటిని గుర్తించి, చారిత్రక సమాచారం, ఫొటోలు, శిలాఫలకాలు, శాసన ఆధారాలు సేకరించి సమర్పించాల్సిందిగా ఇంజినీర్లను ఆదేశించినట్టు చెప్పారు.

Related Stories: