దాడులపై 10 రోజుల ముందే సమాచారం?

కొలంబో: శ్రీలంకకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని 10 రోజుల ముందుగానే ఆదేశ ఇంటెలిజెన్స్‌ సంస్థకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. లంకలో వరుస పేలుళ్లు జరిగే అవకాశం ఉందని ఆదేశ పోలీస్‌ చీఫ్‌ పుజుత్‌ జయసుందర ముందుగానే హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ చర్చిలను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులు చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఆయన నివేదికలు పంపారు. ఇలాంటి మారణహోమం జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఏప్రిల్‌ 11న ఉన్నతాధికారులకు నిఘా సమాచారాన్ని కూడా ఆయన అందించారు. ఓ విదేశీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ సైతం ఇదే విషయాన్ని లంక ప్రభుత్వానికి తెలియజేసినట్లు తాజాగా వెల్లడైంది. నేషనల్‌ తోహీత్‌ జామాత్‌(ఎన్‌టీజే) అనే సంస్థ ప్రముఖ చర్చీలతో పాటు కొలంబోలోని ఇండియన్‌ హైకమీషన్‌ కార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఛాన్స్‌ ఉందని హెచ్చరించింది. బుద్ధుల విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాడికల్‌ ముస్లిం గ్రూప్‌ ఎన్‌టీజే గతేడాది వెలుగులోకి వచ్చింది. ఆదివారం జరిగిన 9 చోట్ల జరిగిన పేలుళ్లలో సుమారు 160 మందికి పైగా మరణించగా 400కు పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. దాడులు జరగడానికి 10 రోజుల ముందే సమాచారం ఉన్నప్పటికీ నిఘా అధికారులు దేశవ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేలుళ్ల సమాచారం ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడం కచ్చితంగా నిఘా వైఫల్యమేనని వాదనలు వినిపిస్తున్నాయి.
More in జాతీయం :