పోలీస్ కురుక్షేత్రం

నా హృదయానికి దగ్గరైన చిత్రమిది. నా టాప్‌టెన్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అని అన్నారు హీరో అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం నిబునన్ ఈ సినిమాను కురుక్షేత్రం పేరుతో శ్రీనివాస్ మీసాల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అరుణ్ వైద్యనాథన్ దర్శకుడు. వైభవ్, ప్రసన్న, సుహాసిని మణిరత్నం కీలక పాత్రధారులు. ఈ నెల 13న ఈ చిత్రం విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదలచేశారు. అర్జున్ మాట్లాడుతూ ముప్ఫైనాలుగేళ్ల క్రితం నా నటజీవితం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. నటన అంటే ఏమిటో తెలియకుండా అడుగుపెట్టి అవార్డులు అందుకున్నాను.

అనుకోకుండానే రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మారాను. నిరంతరశ్రమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నేను నటించిన 150వ చిత్రమిది. రెగ్యులర్ పోలీస్ కథలకు భిన్నంగా ఉంటుంది. పోలీస్ వృత్తిలో ఉండే వ్యథల్ని, కష్టనష్టాల్ని యథార్థ కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, మిస్టరీ, యాక్షన్, క్రైమ్ సమపాళ్లలో ఉంటాయి అని తెలిపారు. ఫిట్‌నెస్ విషయంలో అర్జున్ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, ఫ్యాషన్ స్టూడియో నిర్మాతలు ప్రభుదేవా, మా అబ్బాయి రోహన్‌ల కలయికలో ఓ హారర్ సినిమా నిర్మిస్తున్నారని హీరో శ్రీకాంత్ చెప్పారు. అర్జున్ కెరీర్‌లో మైలురాయిలాంటి చిత్రమిదని, తమిళంలో పెద్ద విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోదండరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, చందన తదితరులు పాల్గొన్నారు.