బాలుడి వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసా

-బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న భానుప్రసాద్ -చిన్నారి దయనీయ పరిస్థితిపై మంత్రి స్పందన.. నేడు నిమ్స్‌కు తీసుకురావాలని ఆదేశం సిరిసిల్ల రూరల్: చిన్న వయస్సులోనే బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన నాలుగేండ్ల బాలుడికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండ లం రగుడు గ్రామానికి చెందిన ఇటికల దేవయ్య-నాగలక్ష్మి దంపతుల కుమారుడు భానుప్రసాద్ (4). ఆర్థిక ఇబ్బందులతో మూడున్నరేండ్ల క్రితం దేవయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కొడుకు భానుప్రసాద్ ఆలనాపాలన చూస్తున్నది. ఇటీవలే భానుప్రసాద్ బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు. తన కొడుకుకు ఖరీదైన వైద్యం చేయించే పరిస్థితి లేదని, ఎవరైనా ఆదుకోవాలని నాగలక్ష్మి వేడుకున్న విషయా న్ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సత్వరమే స్పందించిన మంత్రి.. సోమవారం భానుప్రసాద్‌ను హైదరాబాద్‌కు తీసుకురావాలని సూచించారు. నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన కొడుకుకు మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు నాగలక్ష్మి కృతజ్ఞతలు తెలిపింది. భానుప్రసాద్ దయనీయ పరిస్థితి తెలుసుకున్న స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు ఎవరికి వారు తమకు తోచిన నగదు సాయాన్ని అందజేశారు.