ప్రతిపక్షాలు పారిపోతున్నాయి

-ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం -అభివృద్ధి చేసి చూపించింది మేమే -దళితులకు భూ పంపిణీ నిరంతర ప్రక్రియ -ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు -మీడియాతో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏ రాష్ట్రంలోనైనా ముందస్తు ఎన్నికలంటే ప్రతిపక్షాలు ఎగిరి గంతేస్తాయని, ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దింపి తాము అధికారంలోకి వచ్చేందుకు అవకాశంగా భావిస్తాయని, కానీ మన రాష్ట్రంలో ఎన్నికలంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయని రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మన రాష్ట్రంలో విపక్షాలు ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశాయని చెప్పారు. బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. ప్రగతి వ్యతిరేకమైన కార్యక్రమాలు, చిల్లరమల్లర వ్యవహారాలు.. అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తుండటంతో సీఎం కేసీఆర్ ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుందామని అన్నారనీ, కానీ బయట ఒకరకంగా.. ఎన్నికల కమిషన్ ముందు మరోరకంగా మాట్లాడి ఎన్నికలంటే విపక్షాలు పారిపోతున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు.

పక్క రాష్ర్టాలను చూసైనా నేర్చుకోవాలి

కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు నేతలు తమ ప్రజల పక్షాన రాజకీయాలకు అతీతంగా ఉద్యమించారు. ఇక్కడ అభివృద్ధిచేస్తుంటే ఆరోపణలు చేస్తున్నారు. కాళ్లల్లో కట్టెలు పెడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టులపై కేసులు వేసి అడ్డుకొంటున్నారు. ఇది కేవలం కేసీఆర్‌కు పేరు రావద్దనే కారణంగానే కనపడుతున్నది అని కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్‌కు పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండా అని స్పష్టంచేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని, పారిశ్రామిక రంగంలో భారీగా పెట్టుబడులను తెచ్చామని, ప్రభుత్వ పనితీరుకు 46 అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. మిషన్ భగీరథ తుది దశలో ఉందని.. పాలమూరులో 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. విపక్షాల నేతలు హరితహారాన్ని కూడా రాజకీయంచేస్తున్నారని.. హరితహారంలో రాజకీయలబ్ధి ఏముంటుందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, పంచాయతీ కార్యదర్శుల నియామకం హామీలో లేకున్నా ప్రకటించి భర్తీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

సంక్షేమంతో స్వర్ణయుగం

సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో స్వర్ణయుగం తెచ్చామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మ్యానిఫెస్టో కూడా టీఆర్‌ఎస్ విజయమేనని తెలిపారు. రూ. 200 పింఛన్ కూడా ఇవ్వని కాంగ్రెస్ నేతలతో రూ. 2 వేల పింఛన్ ఇప్పిస్తామని మ్యానిఫెస్ట్టోలో చేర్పించిన ఘనత తమదేనని చెప్పారు. రాష్ట్రంలో 2.46 లక్షల రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వచ్చే మార్చి వరకు హైదరాబాద్‌లో లక్ష ఇండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టంచేశారు. మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీ అని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. 105 మంది అభ్యర్థులను ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సభలైనా, రాజీనామాలైనా ఏది చేసినా సీఎం కేసీఆర్ సంచలనమేనన్నారు. గతంలో టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలతో కలిసిందని, కానీ ఇప్పుడు మహాకూటమి ఎందుకు తయారవుతున్నదో ప్రజలు గమనిస్తున్నారన్నారు.