పారమౌంట్ ఎయిర్‌వేస్‌పై చార్జిషీటు

న్యూఢిల్లీ, జూన్ 7: పారమౌంట్ ఎయిర్‌వేస్, దాని యజమాని ఎం త్యాగరాజన్, మరో ముగ్గురిపై సీబీఐ చార్జీషీట్లను దాఖలు చేసింది. మోసపూరితంగా షెడ్యూల్డ్ ఆపరేటర్ లైసెన్స్ పొందారని, పలు జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.19 కోట్ల విలువైన రుణాలను స్విట్జర్లాండ్ బ్యాంక్ ఖాతాలోకి తరలించారనే ఆరోపణలపై ఈ చార్జిషీట్లను కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు పరిచింది. ఈ వ్యవహారంలో 2016, ఏప్రిల్ 30న సీబీఐ కేసు నమోదు చేయగా, దర్యాప్తులో త్యాగరాజన్ నకిలీ ధ్రువపత్రాలతో షెడ్యూల్డ్ ఆపరేటర్స్ లైసెన్సును పొందినట్లు తేలిందని అధికారులు తెలిపారు. అంతేగాక తన కంపెనీ గోల్డెన్ లోటస్ లీజింగ్ కార్పొరేషన్ (జీఎల్‌ఎల్‌సీ) కోసం సింగపూర్‌లో ఓ విదేశీ ఖాతానూ తెరిచారన్నారు. ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి తీసుకున్న రుణాలను ఏప్రిల్ 2008 నుంచి అక్టోబర్ 2010 మధ్య ఈ ఖాతాలోకి మళ్లించారని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. 2005లో పారమౌంట్ ఎయిర్‌లైన్స్ విమానయాన సేవలను ప్రారంభించగా, 2010లో మూతబడింది. తూర్పు, దక్షిణ భారతంలో ఇది విమానాలను నడిపింది.