అప్పుడు ప్యారాచూట్ దొరికినట్టుంది కదా?

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ పంచ్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొట్టిన గప్పాలపై ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పంచ్‌లు పేల్చారు. తానొక సైనికుడిగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండి దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడినట్టే.. తెలంగాణ ప్రయోజనాల కోసం కూడా ఇప్పుడు పోరాటం చేస్తున్నానని ఉత్తమ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. 2014లో కోదాడ శివారులో ఓ కారులో రూ.2.5 కోట్ల నగదు తగలబడిన కారుకు కూడా మీరే సారథ్యం వహిస్తున్నట్టుంది కదా? ఆ సమయంలో మీకు తప్పించుకొనేందుకు ప్యారాచూట్ దొరికినట్టుంది కదా? అంటూ పంచ్‌లు పేల్చారు. ఈ మేరకు డబ్బు కాలిపోయిన సమయం లో వచ్చిన వార్తా కథనాలను మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌కు జోడించారు. దేశం మొత్తానికి స్కాంగ్రెస్ పార్టీ అవినీతి, ప్రమాదకరమైన పాలన గురించి తెలుసునని స్పష్టంచేశారు. తమ పాలకులు ఎవరో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారని తెలిపారు.