156 టీఎంసీలిస్తే గడ్డుకాలమే..

-ఏపీ ఇండెంట్‌పై కృష్ణాబోర్డుకుతెలంగాణ ఈఎన్సీ లేఖ -ఏపీకి 94 టీఎంసీల విడుదలకు బోర్డు ఉత్తర్వులు -అదనపు నీటి వాడకానికీ ఆమోదం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ కోరినట్టు 156 టీఎంసీల నీటివిడుదలకు కృష్ణాబోర్డు అనుమతిస్తే వచ్చే వేసవి నాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల కింద ఎండీడీఎల్ కంటే దిగువకు నీటిని వాడుకోవాల్సిన గడ్డుపరిస్థితి తలెత్తుతుందని తెలంగాణ నీటిపారుదలశాఖ.. కృష్ణానదీ యాజమాన్యబోర్డును హెచ్చరించింది. 156 టీఎంసీలు కావాలంటూ ఏపీ ఈఎన్సీ కృష్ణాబోర్డుకు లేఖరాసిన నేపథ్యంలో.. తెలంగాణ ఈఎన్సీ స్పందించారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు బుధవారం బోర్డుకు లేఖరాశారు. ఈనెల 10వరకు ఏపీ తనవాటా 123.184 టీఎంసీల కంటే 22.834 టీఎంసీల నీటిని ఎక్కువగా వాడుకున్నదని, తెలంగాణ మాత్రం తనవాటా 71.943 టీఎంసీల కంటే 22.834 టీఎంసీలు తక్కువగా వాడుకున్నదని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో 308.66 టీఎంసీలు వాడుకునేందుకు అందుబాటులో ఉండగా.. వాటిలో 163 టీఎంసీలు ఏపీ వాటాగా ఉన్నాయన్నారు. ఇందులో 156 టీఎంసీలను నవంబర్ వరకే ఏపీ వాడుకుంటే.. వేసవినాటికి ఎండీడీఎల్ దిగువకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. తాగునీటి అవసరాలకూ ఇబ్బం ది ఏర్పడే ప్రమాదం ఉన్నదన్నారు. ఏపీ కోరినట్టు నీటివిడుదలకు ఉత్తర్వులివ్వకుండా త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా వాడుకునేలా ఉత్తర్వులు తెలంగాణ అభ్యంతరాలను లెక్కచేయకుండా కృష్ణాబోర్డు ఏపీకి 94 టీఎంసీల నీటివిడుదలకు ఉత్తర్వులు జారీచేసింది. ఏ ప్రాజెక్టు కింద ఎంత వాడుకోవాలో అనేది కూడా పేర్కొనకుండా ఉత్తర్వులు ఇచ్చింది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, సాగర్ ఎడమ, కుడికాల్వతోపాటు కృష్ణాడెల్టా కింద ఈ నీటిని వాడుకోవాలని అందులో పేర్కొనడం గమనార్హం. బోర్డు లెక్కల ప్రకారమే.. అనుమతి లేకుండా ఏపీ 60 టీఎంసీలకు పైగా వాడుకున్నది. బోర్డు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులలో అనుమతి లేకుండా వాడుకున్న నీటిని పరిగణనలోనికి తీసుకోనట్టుగా స్పష్టమవుతున్నది. ఈ క్రమం లో 94 టీఎంసీల నీటివిడుదల ఉత్తర్వులు, గతంలో అదనంగా వాడుకున్న 60 టీఎంసీలకుపైగా జలాలు.. కలిపి ఏపీ ఇండెంట్ ప్రకారం 156 టీఎంసీల లెక్క వస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.