టెలిమెట్రీపై మళ్లీ రగడ

-మొదటిదశ ప్రారంభించేందుకు సిద్ధమైన బోర్డు -రెండోదశతోకలిపి ప్రారంభించాలన్న తెలంగాణ -నేటి భేటీని వాయిదావేయాలన్న ఈఎన్సీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణా ప్రాజెక్టులపై తొలిదశలో 14చోట్ల అమర్చిన టెలిమెట్రీ పరికరాలను ప్రారంభిం చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సిద్ధ మైంది. వీటి ఏర్పాటుపై తెలంగాణ ఈఎన్సీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా రు. రెండు రాష్ర్టాల పరిధిలోని కృష్ణా ప్రాజెక్టులపై టెలిమెట్రీని రెండునెలల్లో ఏర్పాటుచేస్తామని 2015 జూన్‌లో కృష్ణానదీ యాజమాన్యబోర్డు కేంద్ర జలవనరులశాఖ ఎదుట అంగీకరించింది. మూడేండ్లు దాటినా కొలిక్కి తీసుకురాలేదు. మొదటిదశలో జూరాల, శ్రీశైలం, సాగర్ పరిధిలో 18 ప్రదేశాల్లో టెలిమెట్రీని ఏర్పాటుచేసింది. ఇందులో 14 పాయింట్లు తెలంగాణ పరిధిలోనివే. మిగిలిన నాల్గింటిలో ఏపీకి కీలకమైన పోతిరెడ్డిపాడు ఉన్నా ఇంతవరకు కొలిక్కిరాలేదు. మొదటిదశలోని 14 ప్రదేశాల ఎంపిక, అమర్చిన పరికరాలు అంతా నిరుపయోగమేనని బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. దీంతో సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చిస్టేషన్‌తో మళ్లీ సర్వేచేయించి, కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలని బోర్డు గతంలో నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఒక్కఅడుగు కూడా ముందుకుపడలేదు.

రెండోదశ టెలిమెట్రీల ఏర్పాటు జాబితా సిద్ధం కాలేదు. కానీ బోర్డు అధికారులు మొదటిదశ టెలిమెట్రీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీంతో తెలంగాణ నీటిపారుదలశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచే స్తున్నది. టెలిమెట్రీపై బుధవారం కృష్ణాబోర్డు ఏర్పాటుచేసిన సమావేశాన్ని వాయిదావేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు తేల్చిచెప్పారు. రెండోదశలో ఎంపికచేసిన పాయింట్ల వద్ద కూడా టెలిమెట్రీ ప్రక్రియ పూర్తిచేసి అన్నింటినీ ఒకేసారి ప్రారంభించాలని స్పష్టంచేశారు. టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటుచేసిన ఏజెన్సీకి బిల్లులు చెల్లించాలనే తపనతోనే బోర్డు వాటిని అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు సమాచారం.