క్రిస్‌లిన్‌ ఒంటరి పోరాటం..హైదరాబాద్ టార్గెట్ 160

హైదరాబాద్‌: ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు రెచ్చిపోయారు. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మెన్‌ భారీగా పరుగులు చేయకుండా కట్టడి చేశారు. యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌(3/33) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేకేఆర్‌ ఓపెనర్‌ క్రిస్‌లిన్‌(51: 47 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) అర్థశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది. మిడిలార్డర్‌లో రింకూ సింగ్‌(30).. ఆరంభంలో సునీల్‌ నరైన్‌(25: 8 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపులతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. క్రిస్‌లిన్‌ ఆఖరి వరకు పోరాడినప్పటికీ అతని సహకరించే వారు కరువయ్యారు. కెప్లెన్ దినేశ్ కార్తీక్‌(6) నిరాశ‌ప‌రిచాడు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ స్కోరు వేగం పెరగలేదు. ఆతిథ్య జట్టు బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అదరగొట్టింది. ఏ సమయంలోనూ మ్యాచ్‌ చేజారిపోకుండా జాగ్రత్తగా ప్రణాళికలు అమలు చేసి ప్రత్యర్థి ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడకుండా కట్టడి చేసింది. డెత్‌ ఓవర్లలో సన్‌రైజర్స్‌ అద్భుతంగా బంతులేసింది. ముఖ్యంగా ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌(1/23) బౌలింగే మ్యాచ్‌లో హైలెట్‌. సీజన్‌ ఆరంభం నుంచి అన్ని జట్లపై విరుచుకుపడుతున్న ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌(15: 9 బంతుల్లో 2సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడలేకపోయాడు. భువీ(2/35) వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది ఊపుమీదున్న రస్సెల్‌ను అదే ఓవర్‌లో పెవిలియన్‌ పంపాడు. కీలకమైన 18వ ఓవర్‌లో రషీద్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది.
More in క్రీడలు :