మళ్లీ కోహ్లీనే నంబర్‌ వన్‌

దుబాయ్: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశేషంగా రాణించాడు. దాంతో ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సిరీస్‌లో అత్యధికంగా 593 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 930 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (929), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (847), ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (835), ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (820) టాప్-5లో కొనసాగుతున్నారు. సిరీస్ ఆరంభానికి ముందు 27 పాయింట్ల వెనుక ఉన్న విరాట్ సిరీస్ ముగిసిన త‌రువాత స్మిత్ క‌న్నా ఒక పాయింట్ ముందంజ‌లో ఉన్నాడు. విరాట్‌కు స్మిత్ మ‌ధ్య ఒక్క పాయింట్ మాత్ర‌మే తేడా ఉంది. ఇక ఓవల్‌లో చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడిన ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్.. రెండు ఇన్నింగ్స్‌లో 71, 147 పరుగులు చేయడంతో 11 స్థానాలు మెరుగుప‌ర‌చుకొని 709 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. పుజారా 772 పాయింట్లతో ఆరో స్థానంలో, లోకేశ్ రాహుల్ 635 పాయింట్లతో 19వ ర్యాంకులో ఉన్నారు. బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 899 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తరఫున రవీంద్ర జడేజా 814 పాయింట్లతో నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ 769 పాయింట్లతో ఎనిమిదో ర్యాంకులో ఉన్నారు.
× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం