పంజాబ్‌కు 'బిగ్'పంచ్

ఇండోర్: ఐపీఎల్-11లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కోల్‌కతా నైట్ రైడర్స్ పెద్ద షాక్ ఇచ్చింది. పంజాబ్‌పై గెలిచిన కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు సొంతగడ్డపై కేకేఆర్‌ను దెబ్బకొట్టి ప్లేఆఫ్ ఛాన్స్‌లను మెరుగుపరచుకోవాలని భావించిన కింగ్స్‌కు నిరాశ తప్పలేదు. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో కోల్‌కతా 31 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా బ్యాట్స్‌మెన్ సమష్టిగా చెలరేగడంతో 20 ఓవర్లకు 245 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోకేశ్ రాహుల్(66: 29 బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లు) ఒక్కడే ఆరంభంలో గొప్ప ప్రదర్శన చేశాడు. ఆఖర్లో కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్(45: 22 బంతుల్లో 4ఫోర్లు 3సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 200 పరుగుల మార్క్‌ను దాటింది. ఆండ్రీ రసెల్(3/41) కీలక వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ కృష్ణా(2/31) మంచి ఎకానమీతో పంజాబ్‌ను కట్టడి చేశాడు. అంతకుముందు కోల్‌కతా ఇన్నింగ్స్‌లో సునీల్ నరైన్(75: 36 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు), క్రిస్‌లిన్(27: 17 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), రాబిన్ ఉతప్ప(24: 17 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్), ఆండ్రూ రస్సెల్(31: 14 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు), దినేశ్ కార్తీక్(50: 23 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) విధ్వంసం సృష్టించి పంజాబ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆరంభంలో నరైన్ మంచి పునాది వేయగా.. పంజాబ్ బౌలర్లు పుంజుకుంటున్న సమయంలో ఆఖర్లో దినేశ్ కార్తీక్ తక్కువ బంతుల్లోనే అర్ధశతకం సాధించి భారీ స్కోరు అందించాడు. ఆండ్రూ టై(4/41) కీలక వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
× RELATED శృంగారానికి ఒప్పుకోలేదని ట్రాన్స్‌జెండర్‌పై కాల్పులు