దుమ్మురేపారు.. పంజాబ్ లక్ష్యం 246

ఇండోర్: శనివారం ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం వేళ పరుగుల వర్షం కురిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ వీరబాదుడు బాదేశారు. మైదానం నలువైపులా బౌండరీలు కొడుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. ఆరంభం నుంచే క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ తమదైన శైలిలో చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు కోల్‌కతా 245 పరుగులు చేసింది. వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ నెట్ రన్‌రేట్ పడిపోకుండా దూకుడుగా ఆడటంతో అలవోకగా 200 పరుగుల మార్క్‌ను దాటింది. సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కేకేఆర్ పరుగుల ప్రవాహం ముందు కింగ్స్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. స్పిన్, పేస్ బౌలర్ అని తేడాలేకుండా అందరినీ ఉతికారేశారు. ఆండ్రూ టై(4/ 41) కీలక వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ బౌలర్లందరూ ఓవర్‌కు 10కి పైనే పరుగులిచ్చారు. భారీ ఇన్నింగ్స్ ఆడింది వీళ్లే.. సునీల్ నరైన్(75: 36 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు), క్రిస్‌లిన్(27: 17 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), రాబిన్ ఉతప్ప(24: 17 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్), ఆండ్రూ రస్సెల్(31: 14 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు), దినేశ్ కార్తీక్(50: 23 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) విధ్వంసం సృష్టించి పంజాబ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆరంభంలో నరైన్ మంచి పునాది వేయగా.. పంజాబ్ బౌలర్లు పుంజుకుంటున్న సమయంలో ఆఖర్లో దినేశ్ కార్తీక్ తక్కువ బంతుల్లోనే అర్ధశతకం సాధించి భారీ స్కోరు దిశగా నడిపించాడు.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య