377కు అంకురార్పణ ఆ రాజు కాలంలోనే..

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారత శిక్షాస్మృతిలోని 377వ నిబంధనను సుప్రీంకోర్టు కొట్టివేయడం ఇప్పుడు దేశంలో పెద్దవార్త. సాంప్రదాయిక మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. 377ను రద్దు చేయడం విషయంలో సుప్రీంకోర్టు ఐచ్ఛికంగా నిర్ణయం తీసుకున్నది. అందుకు కారణం ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడమే. ఎటువైపు మొగ్గితే ఏం తంటానో అన్నట్టుగా ప్రభుత్వం గోడమీది పిల్లివాటంగా పోయింది. దాంతో కోర్టు స్వలింగ సంపర్కం ఏమాత్రం నేరం కాదంటూ ఢంకా బజాయించింది. అంతేకాదు, తీర్పు సందర్భంగా కోర్టు ఈ నిబంధన వెనుక గల చరిత్రను కూడా తవ్విపోసింది. మనదేశంలో 158 సంవత్సరాల క్రితం బ్రిటిష్ సర్కారు కాలంలో ఈ చట్టం వచ్చింది. కానీ దీని మూలాలు అంతకు 300 సంవత్సరాల ముందే ఉన్నాయి. 1533లో ఎనిమిదో హెన్రీ రాజు తెచ్చిన బగ్గరీ యాక్టు మొట్టమొదటిసారిగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ శిక్షలు ప్రవేశపెట్టింది. 1861 వరకు ఇంగ్లండ్‌లో స్వలింగ సంపర్కానికి మరణశిక్ష అమల్లో ఉండేది. జస్టిస్ చంద్రచూడ్ ఈ సంగతి తన తీర్పులో వెల్లడించారు. ఇకపోతే ప్రత్యేకంగా తొలగించని బ్రిటిష్ చట్టాలన్ని యథాతథంగా అమల్లో ఉంటాయని భారత రాజ్యాంగంలోని 372(1) అధికరణం సూచించింది. దాంతో 377 లాంటివి వారసత్వంగా లభించాయి. ఇక జస్టిస్ నారిమన్ కూడా మరికొంత చరిత్రను తన తీర్పులో వెల్లడించారు. 1806 నుంచి మొదలుకొని 1861 వరకు.. 404 మందికి మరణశిక్షలు పడ్డాయి. వారిలో 56 మందికి మరణశిక్ష అమలు చేశారు. మిగిలినవారిని జైలులో ఉంచారు లేదా ఆస్ట్రేలియాకు ప్రవాసం పంపారని జస్టిస్ నారిమన్ తెలిపారు. ఆ విధంగా ప్రభుత్వం తరఫున 377పై కోర్టు నిర్ణయం తీసుకోవడమే కాకుండా చరిత్రను చెప్పే బాధ్యతను కూడా కోర్టు నిర్వహించింది.

× RELATED టీఆర్‌ఎస్ అందరి పార్టీ..: మంత్రి కేటీఆర్