కొలువుదీరిన చండీకుమారుడు..

ఖైరతాబాద్ : అరు దశాబ్దాల చరిత్ర....అరవై అడుగుల నిండైన రూపం...చారిత్రక భాగ్యనగరి సిగలో ఓ కలికితురాయిగా నిలిచిన ఈ భారీ విగ్రహం దర్శనం కోసం అన్ని ప్రాంతాల నుంచి తరలివస్తారు. 1957లో స్వాతంత్య్ర సమరయోధుడు సింగారి శంకరయ్య తొలిసారి ప్రస్తుత ఖైరతాబాద్ గణేశుడి మండపంలో ఒక్క అడుగు గణపతి ప్రతిమను ప్రతిష్ఠించాడు. నాటి నుంచి ప్రతి ఏడాది ఒక్కో అడుగు పెంచుతూ 60 అడుగల మహాగణపతిని తయారు చేసి ఎత్తైన విగ్రహాల రూపకల్పనలో నూతన ఒరవడిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ఏడాది కూడా అరవై అడుగుల మహా రూపాన్ని సాక్షాత్కరింపచేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు శ్రీ చండీ కుమార అనంత మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. krbd-shiva అనంత మహాగణపతి చారిత్రక పురాణం శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపం పురాణ చరిత్రకు తార్కాణంగా నిలుస్తుంది. 60 అడుగుల మహాగణపతి విగ్రహం వెనుక వైపు మేరు పర్వతంపై కల్పవృక్షం, 14 తలల ఆదిశేషుడి నీడల్లో, డాలు, శంఖు, చక్ర, గదాధారిగా ఎనిమిది చేతులతో, నిండైన విగ్రహం సాక్షాత్కరిస్తుంది. కుడివైపున సింహవాహనంపై చండీ మాత, ఎడమవైపు నెమలివాహనంపై కుమారస్వామి, కుడి వైపు మరోచోట ఆత్మలింగ సహితుడై, ధ్యానముద్రలో మహాకాళ శివుడు, ఎడమ వైపు మరోచోట మహిషాసుర మర్ధిని దుర్గమ్మవారు కొలువుదీరారు. అలాగే ప్రకృతి రమణీయతకు చిహ్నంగా విగ్రహం పైభాగాన మేరు పర్వతంపై పచ్చని కల్పవృక్షం, ఆక్కడ పక్షులు సేదతీరటం కనిపిస్తుంది. ఈ విగ్రహం రూపకల్పనలో ఓ విశిష్టత ఉందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు గౌరిభట్ల విఠల శర్మ సిద్దాంతి చెబుతున్నారు. లోకంలో అనావృష్టి తొలగిపోయి పొలాలు సమృద్ధిగా పండి, సఖల శుభాలు కలిగేందుకు చండీ యాగాన్ని శాస్ర్తోక్త రీతిని నిర్వహిస్తారు. ప్రస్తుత చండీ కుమార అనంత మహాగణపతిని దర్శించుకుంటే అదే ఫలితం దక్కుతుందని అంటున్నారు. అనంత మహాగణపతి చుట్టు కొలతలివే... మేరు పర్వతం, 14 తలల ఆదిశేషుడుతో కలిపి 60 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మహాగణపతిని నిర్మించారు. తలభాగం 15 అడుగులు, తొండము 18అడుగులు , కాళ్లు 20 అడుగులు, ఆదిశేషుడు 20 అడుగులు, మేరు పర్వతం 30 అడుగులతో నిర్మించారు. ఈ మహాకాయుడి రూపాన్ని మలిచేందుకు 25 టన్నుల స్టీలు, 34 టన్నుల పీఓపీ, 60 బండిల్స్ జనపనారా, 600 బస్తాల బంకమట్టి, 20వేల మీటర్ల గోనెసంచులను వినియోగిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడికి 300 లీటర్ల 15 రకాల సహజ రంగులను వినియోగించారు. శిల్పి రాజేంద్ర చేతుల మీదుగా... తమిళనాడు రాష్ట్రం, తిరుచునాపల్లి జిల్లా పుదువెటప్పుడి గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన చిన్నస్వామి రాజేంద్రన్ మూడు దశాబ్దాల నుంచి గణేశుడి విగ్రహాల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. 1978లో తొలిసారి ఖైరతాబాద్ గణేశుడిని రూపొందించిన రాజేంద్రన్ 2014లో 60 అడుగుల మహాగణపతి, ప్రస్తుతం చండీ కుమార అనంత మహాగణపతి రూపాలు ఆయన మది నుంచి ఉద్భవించినవే. ప్రపంచ దేశాలు ఆకర్షించే రూపాల్లో గణేశుడిని రూపొందించిన శిల్పి రాజేంద్రనగర్ ఈ నెల 6న హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. krbd-durgamma
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?