KFC రహస్యం వారికే తెలుసు

ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్‌సీ ఫుడ్‌కు చాలా క్రేజ్ ఉంది. చికెన్ ప్రియులైతే లొట్టలేసుకొని మరీ తింటారు. కేఎఫ్‌సీ టేస్టే వేరబ్బా.. ఏమేం మసాలాలు వేస్తాడో కానీ.. సూపర్బ్ అంటుంటారు తిన్న తర్వాత. ఆ చికెన్ మసాలా దినుసులు అంత టేస్టీగా ఉంటాయి కాబట్టే.. ఇప్పటికీ కేఎఫ్‌సీ రెస్టారెంట్లు కిటకిటలాడుతుంటాయి. ఇంతకీ కేఎఫ్‌సీ చికెన్ మసాలా దినుసుల్లో ఏమేం కలుపుతారో తెలుసా? నిజంగా ఎవ్వరికీ తెలియదు. ఇది చాలా రహస్యం కూడా. అది కేవలం వారికి మాత్రమే తెలుసు.!!

ప్రపంచవ్యాప్తంగా 22,621 రెస్టారెంట్లు..

ఇండియాలో ఉన్నవి దాదాపు 500.. మన హైదరాబాద్‌లో ఉన్నవి 16. ఇదీ.. ఎక్కడో మారుమూల ఓ గ్యాస్ షెడ్‌లో పురుడుపోసుకున్న కేఎఫ్‌సీ రికార్డు.కేఎఫ్‌సీ.. ప్రపంచ వ్యాప్తంగా ఇంతలా విస్తృతి చెందడానికి కారణం.. రుచి. స్పైసీగా ఉండే ఈ ఫుడ్ అంటే.. ఇష్టపడని వారుండరు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందిన మొదటి వ్యాపార సంస్థగా కేఎఫ్‌సీ పేరు తెచ్చుకున్నది. ఈ వంటకం పుట్టుక దగ్గర్నుంచి.. రుచి వరకూ అన్నీ ఆశ్చర్యపరిచే విషయాలే.

ఇప్పటికీ రహస్యమే..!

కేఎఫ్‌సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్) రుచి చాలా ప్రత్యేకం. ఇందుకు కారణం.. ఈ ఫ్రైడ్ చికెన్‌లో వాడే 11 రకాల మసాలా దినుసులు ఎలా చేస్తారు? అనేది నేటికీ రహస్యమే. కేఎఫ్‌సీకి దినుసులు సరఫరా చేసేందుకు రెండు కంపెనీలు ఉన్నాయి. ఇవి వేర్వేరు కంపెనీలు. ఈ వేర్వేరు కంపెనీల నుంచి దిగుమతి చేసుకున్న మసాలా దినుసులను వేరే ప్రదేశంలో మిక్స్ చేస్తారు. అలా కలిపిన దినుసులను కేఎఫ్‌సీ రెస్టారెంట్లకు పంపుతారు. ఈ దినుసులను ఎలా కలుపుతారు? వాటిల్లో ఏమేం పదార్థాలు అదనంగా కలుపుతారో ఎవ్వరికీ తెలియదు. కలిపిన దినుసులున్న ప్రాంతంలో సెక్యూరిటీ ఉంటుంది. ఆ గదులకు నిత్యం తాళాలు వేసి ఉంచుతారు. అక్కడ కేవలం కొద్దిమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడికి వెళ్లే వారి వివరాలు చాలా గోప్యంగానూ ఉంటాయి. కేవలం వారికి మాత్రమే తెలుసు.. కేఎఫ్‌సీకి ఎలాంటి మసాలా దినుసులు వస్తాయి? వాటిని ఎలా కలుపాలి? అని. రుచి విషయంలో ఇంత గోప్యత పాటిస్తున్నారు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్‌సీ విస్తరించింది.

కేఎఫ్‌సీ ఎలా పుట్టుకొచ్చిందంటే..?

కేఎఫ్‌సీని అమెరికాకు చెందిన కల్నల్ హర్లాండ్ సాండర్స్ స్థాపించారు. ఈయన కెంటకీ రాష్ట్రంలోని కార్బిన్ ప్రాంతంలో సాండర్స్ కోర్టు కేఫ్ అనే పేరుతో 1930లో ప్రారంభించారు. అది కూడా ఓ పాత గ్యాస్ స్టేషన్‌లో. సాండర్స్‌కు అప్పటికి 40 యేండ్లు. ఆ వయసులో ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాడు. 9 సంవత్సరాల తర్వాత సాండర్స్ ఒక ఫార్ములాను కనుగొన్నాడు. 11 రకాల మసాలా దినుసులను కలిపి చికెన్‌తో పాటు ఒక ప్రెషర్ కుక్కర్‌లో వండిన డిష్ జనాలకు విపరీతంగా నచ్చింది. అప్పటికే సాండర్స్, అతని ఫుడ్‌కోర్ట్ చాలా ఫేమస్ అయింది. దీంతో సాండర్స్‌కు గౌరవ సూచకంగా కల్నల్ అనే బిరుదును 1936లో కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఇచ్చారు. 1952లో పీట్ హర్మన్ అనే స్నేహితుడి రెస్టారెంట్‌లో కెంటకీ ఫ్రైడ్ చికెన్ పేరుతో తన డిష్‌ను 4 సెంట్ల (అమ్ముడయిన ప్రతి డిష్ పైన) రాయల్టీతో అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు సాండర్స్. ఈ ఐడియా సక్సెస్ కావడంతో ఇతర రెస్టారెంట్ల వారితో ఇదే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం మొదలుపెట్టాడు. 1963 కల్లా అమెరికా, కెనడాల్లో దాదాపు 600 రెస్టారెంట్లలో కేఎఫ్‌సీ అమ్ముడయ్యేది.

పేరు వెనుక..

1964లో తన 74వ యేట సాండర్స్ కేఎఫ్‌సీని ఒక ఫ్రాంచైజీలాగా మార్చి.. వెంచర్ కాపిటలిస్ట్ జాక్ మెస్సీకి అమ్మడానికి ఒప్పుకున్నాడు. కొంత ఒప్పందానికి కేఎఫ్‌సీని అమ్మినా.. ఆయన మరణించేదాక (1980) వ్యాపార అభివృద్ధి కోసం కృషి చేశారు. కేఎఫ్‌సీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తం అయ్యేలా ప్రణాళికలు రచించాడు సాండర్స్. అయితే కల్నల్ సాండర్స్ మరణించినప్పుడు కెంటకీ రాష్ట్ర జెండాను గౌరవ సూచకంగా నాలుగు రోజుల పాటు సగం వరకు దించి ఉంచారు. 1990లో ఫ్రైడ్ ఫుడ్ పట్ల ఆరోగ్య రీత్యా ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది. దీంతో కెంటకీ ఫ్రైడ్ చికెన్ పేరు పెద్దగా ఉండడంతో కేఎఫ్‌సీ అని నామకరణం చేశారు. భారతదేశంలో మొదటి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌ను బెంగళూరులో 1995 జూన్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 500 రెస్టారెంట్లు విస్తరించింది కేఎఫ్‌సీ. కల్నల్ సాండర్స్ ధరించిన తెల్లని సూట్ కంపెనీ ట్రేడ్ మార్క్‌గా మారింది. జపాన్ అధ్యక్షుడు ఈ సూట్‌ను 21,510 డాలర్లకు కొన్నారు.