ఆప్ఘన్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతం

హైదరాబాద్ : ఆప్ఘనిస్థాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌లో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో తాలిబన్ గ్రూప్స్‌కు చెందిన కీలక నాయకుడితో పాటు మరో ఐదుగురు హతమయ్యారు. బాల్ఖ్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు ఆప్ఘన్ నేషనల్ డిఫెన్స్ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్‌కు సమాచారం అందింది. దీంతో అక్కడ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఉగ్రవాద కీలక నాయకుడు ముల్లాహ్ షాదర్ ఉన్నట్లు బలగాలు గుర్తించాయి. గత ఏడాది కాలం నుంచి ఇక్కడ బలగాలు, తాలిబన్ల మిలిటెంట్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.