ఆ మూడు దేశాల్లో గెలిచిన ఏకైక ఆసియా టీమ్ భారత్!

అడిలైడ్: టీమ్‌ఇండియా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక భారత జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా గెలుపుతో కోహ్లీసేన ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది. ఒక ఆసియా దేశం ఒకే కేలండర్ ఇయర్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో టెస్టు మ్యాచ్‌లు నెగ్గ‌డం ఇదే తొలిసారి. అరుదైన ఫీట్‌ను టీమ్‌ఇండియా ద‌క్కించుకోవ‌డం విశేషం. చివరిసారిగా 2007-08లో అనిల్ కుంబ్లే సారథ్యంలోని భారత్ పెర్త్ టెస్టులో గెలుపొందింది. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్టు మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాన్నందించిన ఏకైక ఆసియా కెప్టెన్‌గా విరాట్ ఘనతను అందుకున్నాడు. ఆసీస్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆరంభ టెస్టులోనే టీమ్‌ను గెలిపించిన సారథిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 2011-12లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని భారత్ 4-0తో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ తర్వాత 2014-15లో 2-0తో సిరీస్ చేజార్చుకుంది. రెండో టెస్టులోనూ ఇదే ఉత్సాహంతో సత్తాచాటి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని కోహ్లీసేన ఆశిస్తోంది.