ఏడాదిపాటు అన్ని సంబురాలు రద్దు!

కొచ్చి: జల విలయంలో చిక్కుకొని విలవిల్లాడిన కేరళలో ఏడాది పాటు అన్ని అధికారిక సంబురాలను రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ వర్షాలు, వరదల్లో 350కిపైగా ప్రజలు చనిపోగా.. వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళతోపాటు అన్ని యూత్ ఫెస్టివల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంబురాల కోసం అవసరమయ్యే భారీ మొత్తాన్ని వరద సహాయక చర్యలకు తరలించనున్నట్లు తెలిపింది. రూ.30 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. పరిస్థితి పూర్తిగా సమీక్షించిన తర్వాత అధికారిక సంబురాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఏ ప్రభుత్వ శాఖ ఏడాది పాటు ఎలాంటి పండుగ నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వీటి ద్వారా మిగిలిపోయిన నిధులను సీఎం రిలీఫ్ ఫండ్‌కు తరలించాలని స్పష్టంచేసింది. సోమవారం వరకు రిలీఫ్ ఫండ్‌కు రూ.1036 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రజల నుంచి మరిన్ని విరాళాలు సేకరించడానికి కేరళ మంత్రులు త్వరలోనే 14 దేశాల్లో పర్యటించనున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి.. వరద నుంచి బయటపడుతున్నా.. చాలా ప్రాంతాల్లో రోగాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే 71 మంది ఎలుకల కారణంగా వ్యాపిస్తున్న వ్యాధి బారిన పడ్డారు. వివిధ రోగాలతో ఆసుపత్రిలో చేరిన 13800 మంది చికిత్స పొందుతున్నారు.

× RELATED ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి