అయ్యో, వానపానులు చచ్చిపోయాయి.. ఇప్పుడెలా?

కేరళలో వరదలు తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే జనజీవితం సాధారణ స్థాయికి వస్తున్నది. రోడ్ల మీద బురద తొలగింపు, ఇండ్ల శుద్ధి వంటి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ ఉత్తర కేరళ రైతులకు ఓ కొత్త సమస్య వేధిస్తున్నది. అదేమిటంటే వానపాముల నష్టం. భారీ సంఖ్యలో వానపాములు వరదల వల్ల చనిపోయి నీటిలో తేలాయి. భూసారాన్ని పెంచి పోషించడంలో వానపాముల పాత్ర అంతాఇంతా కాదు. వదులుగా ఉండే భూమి పైపొర వరదలకు కొట్టుకుపోయింది. గట్టినేల తేలింది. ఇది వానపాములకు అనువైన పరిస్థితి కాదు. అవి బయటకి వచ్చి చనిపోతున్నాయి. ఇదేదో ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు. ఉత్తరకేరళలో ఎక్కువగా పర్వత ప్రాంతాలుంటాయి. అన్నిచోట్లా ఇదే సమస్య ఏర్పడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. వానపాముల మృతి వెనుక పెద్ద పర్యావరణ సమస్య ఏదో ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చెలకలు మాయం కావడం, కాంక్రీటు నిర్మాణాలు అధికం కావడం, యథేచ్ఛగా గనులు తవ్వడం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. వానపాములు లేని భూమితో ఏం వ్యవసాయం చేస్తామా అని రైతులు తలలు పట్టుకుంటున్నారు.

Related Stories: